సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఈసారి చెరుకు మరింత తీపెక్కింది. ఈ ఏడాది చెరుకు క్రషింగ్ సీజను ఆశాజనకంగా ముగిసింది. గతేడాది క్రషింగ్ సీజను కంటే ఈ సీజనులో ఏకంగా 2.55 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా క్రషింగ్ జరిగింది. 2024–25 సీజనులో 15.99 లక్షల మెట్రిక్ టన్నుల క్రషింగ్ జరుగగా, 17.04 లక్షల క్వింటాళ్ల చక్కెర ఉత్పత్తి అయింది. 2025–26లో 18.54 లక్షల మెట్రిక్ టన్నుల చెరుకు క్రషింగ్ జరగగా 19.95 లక్షల క్వింటాళ్ల పంచదార ఉత్పత్తి అయింది. ఈమేరకు షుగర్ కేన్ కమిషనరేట్ గణాంకాలు చెబుతున్నాయి. గతేడాదికంటే ఏకంగా 15% అధికంగా చెరుకు క్రషింగ్ జరగడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12 చక్కెర కర్మాగారాలున్నాయి. ఇందులో ప్రభుత్వ, సహకార రంగాల్లో ఉన్న ఐదు చక్కెర కర్మాగారాలు మూతపడ్డాయి. సంగారెడ్డి, కామారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఏడు షుగర్ ఫ్యాక్టరీల్లో ఈ సీజనులో చెరుకు క్రషింగ్ జరిగింది. ఏటా నవంబర్ మొదటి వారంలో చెరుకు క్రషింగ్ ప్రారంభమవుతుంది. మార్చి రెండో వారంతానికి ఈ సీజను ముగుస్తుంది.
టన్నుకు రూ.3,826 చొప్పున ధర చెల్లింపు
ఈసారి చెరుకు రైతులకు అత్యధికంగా టన్నుకు రూ.3,826 చొప్పున చెల్లించారు. చాలావరకు టన్నుకు రూ.3,600 నుంచి రూ.3,700 వరకు మాత్రమే చెల్లించాయి. అయితే ఈ చెరుకు ధరను పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సుధీర్ఘ పంట కాలానికి తోడు, పెరిగిన పెట్టుబడులు, కూలీల ఖర్చులు, కూలీల కొరత వంటి కారణంగా పెట్టుబడి వ్యయం గణనీయంగా పెరుగుతోందని కనీసం టన్నుకు రూ.నాలుగు వేల నుంచి రూ.4,200 చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. షుగర్ రికవరీ(ఉత్పత్తి)ని బట్టి చెరుకు ధర నిర్ణయిస్తారు. ఈసారి అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలోని కొత్త షుగర్ ఫ్యాక్టరీ గోదావరి గంగా, కామారెడ్డి జిల్లాలోని గాయత్రీ షుగర్స్ 11% చొప్పున చక్కెర రికవరీ వచ్చింది.
8.25 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి
షుగర్ ఫ్యాక్టరీల్లో చక్కెరతోపాటు, ఉప ఉత్పత్తుల్లో భాగంగా ఇథనాల్ ఉత్పత్తి చేస్తారు. ఈ సీజనులో సుమారు 8.25 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం పెట్రోల్‌లో కొంత శాతం ఇథనాల్‌ను కలిపి సరఫరా చేస్తున్న విషయం విదితమే. చక్కెరతోపాటు, ఇథనాల్ కూడా చక్కెర కర్మాగారాలకు కాసుల వర్షం కురిపిస్తోంది.
ఈసారి 18.54 లక్షలమెట్రిక్ టన్నుల క్రషింగ్
గతేడాది కంటే 2.55 లక్షలుఎంటీలు అధికం
19.95 లక్షల క్వింటాళ్ల చక్కెర,8.25 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి
రాష్ట్రంలో ముగిసిన క్రషింగ్ సీజను
పంట విస్తీర్ణం పెరుగుతున్నందుకే..
ఈసారి చెరుకు సీజను ఆశాజనకంగా ఉండటానికి ప్రధాన కారణం ఈ పంట సాగు విస్తీర్ణం పెరగడమేనని షుగర్ కేన్ కమిషనరేట్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో చెరుకు సాగవుతోంది. అలాగే కామారెడ్డి, వనపర్తి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రైతులు ఈ చెరుకును సాగు చేస్తున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గతేడాది పత్తి పంట దెబ్బతింది. దీంతో చాలా మంది రైతులు పత్తికి ప్రత్యామ్నాయంగా చెరుకు వైపు మొగ్గు చూపారు. అలాగే ఆలుగడ్డ, అరటి పంటలకు ఆశించిన ధర దక్కలేదు. దీంతో ఈ పంట సాగు చేసే రైతులు కూడా ప్రత్యామ్నాయంగా చెరుకు వైపు మొగ్గు చూపారు. దీంతో ఈ పంట సాగు విస్తీర్ణం పెరిగింది. గతేడాది 2024–25 సీజనులో రాష్ట్రవ్యాప్తంగా 14,102 ఎకరాల్లో ఈ పంట సాగు కాగా, ఈ ఏడాది ఈ పంట విస్తీర్ణం 18,092 ఎకరాలకు పెరిగింది. సుమారు 3,990 ఎకరాల్లో చెరుకు విస్తీర్ణం పెరిగింది. దీంతో క్రషింగ్ సీజను ఆశాజనకంగా మారిందని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి.


