గొడవపడి ..బయటకు వెళ్లి.. | - | Sakshi
Sakshi News home page

గొడవపడి ..బయటకు వెళ్లి..

Mar 26 2026 10:55 AM | Updated on Mar 26 2026 10:55 AM

కొండపాక(గజ్వేల్‌): రాజీవ్‌ రహదారి ప్రక్కన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన కుకునూరుపల్లి పోలీస్టేషన్‌ పరిధిలోని రాంచంద్రాపూర్‌ గ్రామపంచాయితీ శివారులో బుధవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. మిరుదొడ్డి మండలంలోని పెద్ద చెప్యాల గ్రామానికి చెందిన తలారి అంజయ్య(44) కుటుంబీకులు బతుకుదెరువు కోసం 7 నెలల కిందట హైదరాబాద్‌కు వెళ్లారు. కుటుంబపోషణ విషయంలో తరచుగా భార్యాభర్తలు గొడవపడుతుండేవారు. ఈ క్రమంలో భర్త అంజయ్య ఇంట్లో చెప్పాపెట్టకుండా బయటకు వెళ్లి రెండు మూడు రోజుల తర్వాత వచ్చేవాడు. ఈనెల 24న భార్యభర్తల మధ్య గొడవ జరగ్గా ద్విచక్ర వాహనంపై ఇంటినుంచి వెళ్లి తిరిగి రాలేదన్నారు. కాగా, బుధవారం ఉదయం రాజీవ్‌ రహదారి ప్రక్కన మృతదేహం పడి ఉందని స్థానికుల నుంచి సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. పక్కనే ఉన్న పండ్ల విక్రయ దుకాణ దారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుడు రాత్రి పూట ఎప్పుడో వచ్చి మక్క కంకుల విక్రయ కోసం వేసిన గుడిసెలో పడుకోగా ఉదయం గుడిసె యజమానురాలు వచ్చి నిద్రలోంచి లేపగా లేచిన కొద్దిసేపటికే అంజయ్య మృతి చెందాడు. మృతుడి వద్ద లభించిన ఆధార్‌ కార్డు ఆధారంగా పోలీసులు కుటుంబీకులకు సమాచారం అందించి మృతదేహాన్ని గజ్వేల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య అనిత ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌ఓ, ట్రైనీ ఐపీఎస్‌ అయేషా ఫాతిమా పేర్కొన్నారు.

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

వర్గల్‌(గజ్వేల్‌): వర్గల్‌ మండలం నాచారంగుట్ట ప్రాంతంలో పోలీసులకు గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. గౌరారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...నాచారంగుట్ట సమీపంలోని ఓ పాత ఇంటిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. మృతుడి వయసు సుమారు 50 నుంచి 60ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. నాచారంగుట్ట ప్రాంతంలో భిక్షాటన చేస్తున్నట్లు స్థానికులు పోలీసులకు వివరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తు పట్టినట్లయితే గౌరారం పోలీసులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు.

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

వెల్దుర్తి(తూప్రాన్‌): చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందిన ఘటన మండలంలోని అందుగులపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన నడిపొల్ల గోపాల్‌(40) మంగళవారం రాత్రి తన కుమారుడు మహేశ్‌తో కలిసి గ్రామ శివారులోని పెద్ద చెరువులో చేపలు పట్టడానికి వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యాడు. కుమారుడి ద్వారా విష యం తెలుసుకున్న గ్రామస్తులు బుధవారం ఉద యం గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టగా చెరువులో మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు.

అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement