జెడ్పీ సీఈఓ ఎల్లయ్య
పెద్దశంకరంపేట(మెదక్): గ్రామపంచాయతీ నూతన వార్డు సభ్యులు పంచాయతీరాజ్ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య సూచించారు. పెద్దశంకరంపేటలోని రైతు వేదికలో జరుగుతున్న వార్డు సభ్యుల రెండో విడత శిక్షణా శిబిరాన్ని, మండల పరిషత్ కార్యాలయంలో రికార్డులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామాలు అభివృధ్దిలో ముందుకు వెళ్లాలంటే వార్డు సభ్యుల పాత్ర కీలకమన్నారు. అనంతరం సిబ్బంది హాజరుశాతాన్ని పరిశీలించి, వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో సూపరిండెంట్ షకీల్, ఎంపీఓ జాకీర్‌హుస్సేన్, జూనియర్ అసిస్టెంట్ కాశీరాం,మాస్టర్ ట్రైనర్‌లు పాషా,లింగప్ప,సోమేశ్వర్, ప్రవీణ్ తదితరులున్నారు.
పేకాట స్థావరంపై
పోలీసుల దాడి
హుస్నాబాద్‌రూరల్: జిల్లెలగడ్డ శివారులో బుధవారం పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ముగ్గురుని పట్టుకున్నారు. ఈ దాడిలో మూడు సెల్ ఫోన్లు, బైక్, రూ.15వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు ఈ దాడి చేశారు. పట్టుబడ్డ ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ మేరకు పోలీసులు బుధవారం మీడియాకు వెల్లడించారు.
విధులకు ఆటంకం
కలిగించిన వ్యక్తి అరెస్ట్
రిమాండ్‌కు తరలింపు
అక్కన్నపేట(హుస్నాబాద్): పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఓ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన కాశబోయిన రమేశ్ అనే వ్యక్తి ఓ వివాదంలో పోలీస్‌స్టేషన్‌కు వచ్చి పోలీసులపై గొడవకు దిగాడు. పోలీసు విధులకు తీవ్ర ఆటంకం, శాంతిభద్రతలకు విఘాతం కలింగించేలా ప్రవర్తించడంతో నిందితుడు రమేశ్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
వ్యక్తి బైండోవర్
మిరుదొడ్డి(దుబ్బాక): ప్రభుత్వ ఉద్యోగులపై వాట్సాప్ గ్రూపులో దుర్భాషలాడటమే కాకుండా విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిని తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు మిరుదొడ్డి ఎస్‌ఐ సమత బుధవారం మీడియాకు వెల్లడించారు. మండల పరిధిలోని పెద్ద చెప్యాల గ్రామానికి చెందిన అంకని బాలరాజు అనే వ్యక్తి వాట్సాప్ గ్రూపులో వ్యవసాయ అధికారులను ఉద్దేశించి దుర్భాషలాడుతూ పోస్టులు పెట్టడంతోపాటు వారి విధులకు ఆటంకం కలిగించడంతో సదరు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు
అక్రమ గ్యాస్ ఫిల్లింగ్
కేంద్రాలపై దాడి
హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలోని మేడిబావి గల్లీలో అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్ చేస్తున్న కేంద్రాలపై పోలీసులు దాడి చేసి గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా గ్యాస్ నింపుతున్నారనే సమాచారంతో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో అక్కన్నపేట మండలం కేశవాపూర్‌కు చెందిన వడ్డెపల్లి మోహన్ నుంచి ఫుల్ గ్యాస్ సిలిండర్, ఖాళీ సిలిండర్, 16 చిన్న సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే పట్టణంలోని ప్రగతినగర్‌కు చెందిన ముద్రకోల శ్రీనివాస్ నుంచి రెండు నిండిన పెద్ద సిలిండర్లు, రెండు చిన్న సిలిండర్లను సీజ్ చేశారు. అనుమతుల్లేకుండా ప్రమాదకర రీతిలో గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తున్న వీరిద్దరిపై కేసు నమోదు చేశారు.
పొదల్లో హుండీ ప్రత్యక్షం
మద్దూరు(హుస్నాబాద్): మండలంలోని కూటిగల్ సమ్మక్క–సాలరమ్మ గద్దెల వద్ద గత నెలలో మాయమైనహుండీ బుధవారం స్థానిక పల్లె ప్రకృతివనంలో ప్రత్యక్షమైంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం సమక్క–సారలమ్మ జాతర తిరుగుడువారం తర్వాత గద్దెల వద్ద ఏర్పాటు చేసిన హుండీని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. కాగా,పల్లె ప్రకృతి వనంను శుభ్రం చేస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బందికి హుండీ కనిపించడంతో గ్రామస్తులకు సమాచారం అందించారు. ఇది దొంగల పనేన ని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు.


