రామాయంపేట(మెదక్): వరకట్న వేధింపులకు ఒక వివాహిత బలైన ఘటన మండలంలోని ప్రగతిధర్మారం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. మృతురాలి తండ్రి వడ్ల బ్రహ్మచారి, పోలీసుల కథనం మేరకు..గ్రామానికి చెందిన బ్రహ్మచారి కూతురు మమత(24)ను మూడేళ్ల క్రితం సిద్దిపేట జిల్లా రాయపోలు మండలం రామవరం గ్రామానికి చెందిన వడ్ల నరసింహాచారికి ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి సమయంలో తులంన్నర బంగారు ఆభరణాలతోపాటు రూ.లక్ష నగదు ఇచ్చారు. పెళ్లయిన ఏడాది వరకు వారి కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత అదనపు కట్నం కోసం మమతను అత్తింటివారి వేధింపులకు గురిచేస్తుండటంతో పుట్టింటికి వెళ్లగా ఆమె తల్లిదండ్రులు నచ్చజెప్పి పంపించారు. అయినప్పటికీ మమతపై వేధింపులు ఎక్కువ కావడంతో 15 రోజుల క్రితం మళ్లీ పుట్టింటికి వచ్చేసింది. అప్పట్నుంచి తరచూ తన కాపురం విషయమై బాధపడుతుండేది. ఉదయం ఇంటిలో ఎవరూ లేని సమయంలో మమత ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ బాల్‌రాజ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తల్లి మృతిని తట్టుకోలేక
కుమారుడు ఆత్మహత్య
తూప్రాన్: తల్లి మరణం తట్టుకోలేక కుమారుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘనపూర్‌లో బుధవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సబ్బని భాగ్యమ్మ అనారోగ్యంతో 15 రోజుల క్రితం మృతి చెందింది. దీంతో మనస్తాపం చెందిన కుమారుడు సబ్బని సంతోష్(40) బుధవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.
వ్యాలిడేషన్ చట్టాన్ని రద్దు చేయాలి
మెదక్ కలెక్టరేట్: పెన్షన్ వ్యాలిడేషన్ చట్టంతో రిటైర్డ్ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ప్రభుత్వం వెంటనే దానిని రద్దు చేయాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగదీష్ చంద్ర డిమాండ్ చేశారు. బుధవారం రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈచట్టంతో రాష్ట్రంలో సుమారు 3 లక్షల మంది విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి 12 లక్షల మందికి భారీ నష్టం జరుగుతుందన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.


