మహిళా సంఘాలకు తీరనున్న సమస్యలు
హత్నూర(సంగారెడ్డి): డ్వాక్రా మహిళల సమస్యల పరిష్కారం కోసం సొంత భవనాలను నిర్మించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా హత్నూర మండలంలో అందుకు సంబంధించిన పనులు జోరుగా కొనసాగుతున్నాయి. మండలానికి 29 గ్రామపంచాయతీల్లో డ్వాక్రా మహిళ భవనాల నిర్మాణం కోసం రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో ఎమ్మెల్యే సునీతారెడ్డితోపాటు అధికారులు భవన నిర్మాణాల కోసం పనులు ప్రారంభించారు. మండలంలో 23 గ్రామాల్లో డ్వాక్రా భవనాల పనులు చకచకా కొనసాగుతున్నాయి. మహిళ సమాఖ్య సంఘాలు ప్రతీ సమావేశాన్ని ఈ భవనంలోనే ఏర్పాటు చేసుకునే అవకాశంతో పాటు ప్రతీనెల బ్యాంకులోన్ తీసుకున్న వాటిని సైతం ఇందులోనే సమావేశపరచుకుని బ్యాంకు రుణాలను చెల్లించేందుకు వెసులుబాటు కలుగనుందని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డ్వాక్రా భవనాల నిర్మాణాల కోసం జిల్లా మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పనులను వేగిరం చేస్తున్నారు. కాసాల, రొయ్యపల్లి, కొత్తగూడెం, సాధులనగర్, సికిందలాపూర్, ఎల్లమ్మగూడ గ్రామాల్లో మాత్రం నిర్మాణం కోసం స్థలం దొరకకపోవడంతో పనులింకా ప్రారంభం కాలేదు.
హత్నూర మండలానికి 29 మంజూరు
23 బిల్డింగ్‌లకు కొనసాగుతున్న పనులు
చురుగ్గా కొనసాగుతున్నాయి
మండలంలో 29 గ్రామాల్లో డ్వాక్రా మహిళ భవనాలు మంజూరు కాగా 23 భవనాలు నిర్మాణాల పనులు చురుగ్గా సాగుతున్నాయి. కేవలం ఆరు గ్రామాల్లో భవన నిర్మాణానికి స్థలం లేక పనులు ఇంకా ప్రారంభించలేదు. మార్చి నెలాఖరునాటికి ఈ ఆరు గ్రామాల్లో కూడా పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం.
– రాజశేఖర్, ఏపీఎం


