ముక్క తగ్గనంటోంది
జోగిపేట(అందోల్): మార్కెట్‌లో చికెన్ ధరలు భారీగా పెరిగి సామాన్య ప్రజలకు భారంగా మారాయి. ఆదివారం కిలో చికెన్ ధర రూ.360కి చేరడంతో మధ్యతరగతి కుటుంబాలు నాన్‌వెజ్ తినడమే కష్టంగా మారింది. లైవ్ చికెన్ రూ.230, స్కిన్‌లెస్ రూ.360, చికెన్ రూ.320 చొప్పున చికెన్ దుకాణాలలో విక్రయిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఒక్కసారిగా ఇంతరేటు పెరగడం గమనార్హం. గతంలో వారానికి ఒకసారైనా చికెన్ కొనుగోలు చేసే కుటుంబాలు ఇప్పుడు ధరలు చూసి వెనక్కి తగ్గుతున్నాయి. చికెన్ ధరల పెరుగుదలకు పలు కారణాలున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. పౌల్ట్రీఫారాల్లో ఉత్పత్తి తగ్గడం, పక్షుల ఆహార వ్యయం పెరగడం, రవాణా ఖర్చులు అధికం కావడం వల్ల ధరలు పెరిగినట్లు తెలిపారు. అలాగే వేసవి ప్రభావం కారణంగా కోళ్ల మరణాలు కూడా పెరిగి సరఫరా తగ్గిందని పేర్కొన్నారు. ఇక వినియోగదారులు మాత్రం ధరల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఇప్పటివరకు కుటుంబంతో కలిసి వారానికి ఒకసారి చికెన్ తినేవాళ్లం. ఇప్పుడు ధరలు ఎక్కువ కావడంతో నెలలో ఒకసారి కూడా కొనలేకపోతున్నాం’’అని పలువురు వినియోగదారులు వాపోతున్నారు. మటన్ ధరలు ఇప్పటికే అధికంగా ఉండగా, చికెన్ కూడా అదే దారిలో నడవడం వల్ల నాన్‌వెజ్ పూర్తిగా దూరమవుతోందని అంటున్నారు. హోటళ్లలో కూడా చికెన్ వంటకాల ధరలు పెరగడంతో కస్టమర్ల రాక తగ్గినట్లు హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు.
చికెన్ కిలో రూ.360
మధ్యతరగతికి మాంసం దూరం


