మెదక్ కలెక్టరేట్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో దివ్యాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించకపోవడం అన్యాయమని ఎన్‌పీఆర్డీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు కవిత పేర్కొన్నారు. శనివారం మెదక్‌లో ఎన్‌పీఆర్డీ ఆధ్వర్యంలో రాష్ట్ర బడ్జెట్‌పై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జె ట్‌లో దివ్యాంగుల సంక్షేమానికి నిధుల కేటాయింపులో తీవ్రమైన నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వం బడ్జెట్‌లో దివ్యాంగుల కోటా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలు విస్మరించిందన్నారు. సంక్షేమ రంగాన్ని విస్మరించి ప్రజా పాలన గురించి ప్రభుత్వం మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశం, యాదగిరి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
ఆయిల్, కాపర్ చోరీ
శివ్వంపేట(నర్సాపూర్): గుర్తుతెలియని వ్యక్తులు ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేసి అందులోని ఆయిల్, కాపర్‌ను చోరీ చేశారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. మండల పరిధిలోని శభాష్‌పల్లి గ్రామంలోని మంగళి పెంటయ్య వ్యవసాయ పొలం వద్దఉన్న 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేసి అందులోని ఆయిల్, కాపర్‌ను ఎత్తుకెళ్లారు. దీంతో బోరుబావులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పంటలకు నిత్యం నీరు అందించాల్సిన సమయంలో ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం కావడంతో రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో కూడా ఈ గ్రామంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.
రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి
కొండపాక(గజ్వేల్): రైతులు పామాయిల్ సాగు చేయాలని రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. నంగునూర్ మండలంలోని నర్మేటలో ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్న ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం తిరిగి హైదరాబాద్‌కు వెళ్తున్న కమ్రంలో దుద్దెడలో మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ మంచాల చిన్న శ్రీనివాస్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. చాలా ఏళ్లుగా ఎక్కువ శాతం రైతులు, మొక్కజొన్న, వరి పంటను సాగు చేయటం వల్ల లాభాలు పొందడం లేదన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సిద్దిపేట జిల్లాలో రూ. 300 కోట్లతో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని నిర్మించారని తెలిపారు. రైతులకు దీర్ఘకాలిక ఆదాయం వచ్చేలా ఆయిల్ పామ్ సాగు చేయాలని సూచించారు. సాగు చేసే రైతులకు ప్రభుత్వం డ్రిప్పు, ఇతర సామగ్రితో పాటు అన్ని రకాలుగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తొగుట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గోవిందరెడ్డి, మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు లింగారావు, నాయకులు కనకరాంలు తదితరులు పాల్గొన్నారు.


