కొల్చారం(నర్సాపూర్): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మండల కేంద్రంలోని మెదక్– నర్సాపూర్ జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ మహమ్మద్ మైనొద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని చిన్నఘనాపూర్ గ్రామానికి చెందిన నాగం నగేశ్(36) గ్రామ శివారులోని ఐఎంఎల్ డిపోలో హమాలీగా పని చేస్తున్నాడు. డిపోకు సెలవు దినం కావడంతో పనిపై కౌడిపల్లికి తన బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో మెదక్ వైపు నుంచి నర్సాపూర్ వెళ్తున్న కారు వెనక నుంచి నగేశ్ బైకును అతివేగంగా ఢీకొట్టింది. దీంతో తలకు తీవ్ర గాయమై అతడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతునికి భార్య పదేళ్లలోపు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
చికిత్స పొందుతూ మేసీ్త్ర..
కౌడిపల్లి(నర్సాపూర్): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మేసీ్త్ర చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ అమరేందర్‌రెడ్డి వివరాల ప్రకారం... ఈనెల 19న కౌడిపల్లిలో జాతీయ రహదారిపై రెండు బైక్‌లు ఢీకొనడంతో ఇద్దరికి తీవ్రగాయాలు, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా మృతుడు అనీల్ స్వగ్రామం సూర్యపేట కాగా కౌడిపల్లిలో మేసీ్త్రగా కూలీపనులు చేస్తున్నాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని హైదరాబాద్ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామం తరలించారు.


