పాఠాలు పూర్తికాలేదు | - | Sakshi
Sakshi News home page

పాఠాలు పూర్తికాలేదు

Mar 20 2026 10:05 AM | Updated on Mar 20 2026 10:05 AM

అస్తవ్యస్తంగా రికార్డుల నిర్వహణ బృందాల నియామకంలో ముఖ్య ఉద్దేశం..

వంద స్కూళ్లు తనిఖీ చేశాం

జహీరాబాద్‌ టౌన్‌: నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాల్సిన పాఠ్యాంశాలు కొన్ని ప్రభుత్వ స్కూళ్లలో పూర్తికాలేదు. ఉపాధ్యాయుల కొరత వల్ల సిలబస్‌ పూర్తికాకపోవడంతో పాఠ్యాంశాల వర్క్‌షీట్లు అలాగే మిగిలిపోయాయి. దీంతో సగం పూర్తయిన సిలబస్‌తోనే విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్న పరిస్థితి నెలకొంది. సర్కారు పాఠశాలల్లో రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. కొన్నిచోట్లయితే అసలు రికార్డుల నిర్వహణనే చేపట్టలేదు. కొన్ని బడుల్లోనైతే పిల్లల దాహార్తిని తీర్చేందుకు కనీసం మంచినీటి వసతులు కూడా లేవు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం కారణంగా మధ్యాహ్నా భోజనం పథకం సరిగ్గా అమలు కావడం లేదు. మరికొన్ని చోట్ల అమలవుతున్న మధ్యాహ్న భోజనం నాణ్యతలోపిస్తోంది. కొన్ని పాఠశాలలకు ప్రహారీగోడల్లేక పశువులు లోపలికి వచ్చేస్తున్నాయి. అవును ఇవన్నీ పసిపిల్లల ‘సాక్షి’గా పచ్చినిజాలు. ప్రైవేట్‌ పాఠశాలలకు ధీటుగా సర్కారు బడులను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటుచేసిన తనిఖీల బృందం ఇచ్చిన నివేదికలో విస్మయకర అంశాలు వెల్లడయ్యాయి.

వంద పాఠశాలల్లో తనిఖీ

సర్కారు స్కూళ్ల బలోపేతానికి ప్రభుత్వం ఉపాధ్యాయులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఇప్పుడున్న వ్యవస్థకు అదనంగా ప్రత్యేక బృందాలను నియమించింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన భోజనం, వసతుల కల్పన, ఉపాధ్యాయుల్లో బోధన నైపుణ్యాలను ఈ బృందాల్లోని సభ్యులు పరిశీలించారు. ఈ మేరకు ప్రత్యేక బృందాలు జిల్లాలోని వంద పాఠశాలలను తనిఖీలు చేసి ప్రభుత్వానికి నివేదికలు అందజేశారు.

బృందాల పనితీరు ఇలా..

జిల్లాలో 15 తనిఖీ బృందాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, యూపీఎస్‌, ప్రాథమిక పాఠశాలతోపాటు ఉర్దూ మీడియం బడులకు వేర్వేరుగా బృందాలను నియమించారు. ఒక్కో టీమ్‌లో ముగ్గురు టీచర్లుండగా ప్రతీ బృందంలో మొదటివ్యక్తి నోడల్‌ అధికారిగా మిగిలిన ఇద్దరు సభ్యులు కొనసాగారు. టీమ్‌ సభ్యులు పాఠశాలలను సందర్శించి విద్యా ప్రగతిని అంచనా వేశారు. ప్రతీ మూడు నెలల్లో ఒక్కో టీమ్‌ ప్రాథమిక, ప్రాథమికోన్నతస్థాయిలో వంద పాఠశాలలు, ఉన్నత పాఠశాలస్థాయిలో 50 స్కూళ్లను తనిఖీ చేశారు. ప్రత్యేక బృందం సభ్యులు ప్రతీరోజు రెండు చొప్పున పాఠశాలలను తనిఖీ చేస్తూ వాటి అభివృద్ధికి తగిన సూచనలు, సలహాలు అందజేశారు.

పాఠశాలలకు బృందం సభ్యులు

వంద పాఠశాలల తనిఖీలు విజయవంతంగా పూర్తి చేసినందుకు బృందం సభ్యులను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు అభినందించారు. ఈ మేరకు తనిఖీలు పూర్తిచేసి తయారు చేసిన నివేదికలను సభ్యులు మండల విద్యాధికారులకు సమర్పించారు. అయితే తనిఖీకి నియమితులైన టీచర్లు మంగళవారం నుంచి యథావిధిగా పాఠశాల విధులకు హాజరయ్యారు.

● ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులసంఖ్య పెంచి వాటిని బలోపేతం చేయడం

● నిరంతర సమగ్ర మూల్యాంకన సాధన

● ప్రాథమిక స్థాయిలో ఎఫ్‌ఎల్‌ఎన్‌, ఉన్నత పాఠశాలస్థాయిలో ఎల్‌ఐపీ ప్రణాళిక అమలు

● విద్యా ప్రమాణాల పెంపుదల, టెక్ట్స్‌బుక్‌, వర్క్‌షాపులతో విద్యార్థులకు అభ్యాసన

● క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు వాటికి పరిష్కారం

● సలహాలు సూచనలివ్వడం, పాఠశాల రికార్డుల పరిశీలన

తాగునీటి వసతులు కరువు

బడుల్లో లోపించిన పారిశుద్ధ్యం

తనిఖీల నివేదికలో వెల్లడి!

ప్రభుత్వానికి అందజేత

నోడల్‌ అధికారి ప్రదీప్‌ కుమార్‌, సభ్యుడు వహబోద్దీన్‌తో కలిసి డిసెంబర్‌ నుంచి ఇప్పటివరకు వంద పాఠశాలలను తనిఖీ చేశాం. తనిఖీల సందర్భంగా ఉపాధ్యాయులు కూడా పూర్తి సహకారం అందజేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు పూర్తి చేసి మనూర్‌ మండల విద్యాధికారికి నివేదికలను అందజేశాం.

–నిమ్మల కిష్టయ్య, బృందం సభ్యులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement