న్యాల్‌కల్ (జహీరాబాద్): సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండల పరిధిలోని రాఘవాపూర్– హుమ్నాపూర్ గ్రామ శివారులోని పంచవటి క్షేత్రంలో నిర్వహిస్తున్న పుష్కరకాల చంఢీరుద్ర మహాయాగానికి పదేళ్లు పూర్తయ్యాయి. లోక కల్యాణార్థం, వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు బాగా పండి దేశ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ పంచవటి క్షేత్రం పీఠాధిపతి శ్రీ కాశీనాథ్‌బాబా పుష్కరకాల శత చండీరుద్ర మహాయాగానికి శ్రీకారం చుట్టారు. లోక కల్యాణార్థం 8 ఏప్రిల్ 2016లో ప్రారంభమైన ఈ మహాయాగం 2028లో పూర్తి కానుంది. ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం క్షేత్ర ఆవరణలో నిర్వహించే యాగంలో ఇద్దరు చొప్పున దంపతులు పాల్గొంటున్నారు. ఇప్పటివరకు 7,168 మంది దంపతులు యాగంలో పాల్గొన్నారు. పదేళ్లు పూర్తయిన సందర్భంగా క్షేత్రంలో వెలసిన దేవతలకు గురువారం కాశీనాథ్‌బాబా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పంటలు పండక ప్రజలు దుర్భిక్ష పరిస్థితుల్లో ఉంటే వారి క్షేమం కోసం ఈ యాగాన్ని 36లక్షల సంవత్సరాల క్రితం సాధువులు, శౌనకాది మహా మునులు నిర్వహించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయన్నారు.


