కొండపాక(గజ్వేల్): ప్రేమించిన అమ్మాయి దక్కలేదన్న మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలో చోటు చేసుకుంది. త్రీటౌన్ సీఐ లక్ష్మిబాబు వివరాల ప్రకారం... ఉత్తరప్రదేశ్, అమీన్‌పూర్‌కు చెందిన అన్నదమ్ములు సౌరబ్ కుమార్, ప్రదీప్ కుమార్ మూడేళ్లుగా మండలంలోని వెలికట్ట శివారులో ఓ కంపెనీలో మేనేజర్లుగా పని చేస్తూ... దుద్దెడలోని అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో అన్న సౌరబ్ కుమార్ పనిమీద సొంత గ్రామానికి వెళ్లగా తమ్ముడు ప్రదీప్ కుమార్ ఒక్కడే ఉన్నాడు. గతంలో ఇదే కంపెనీలో పని చేసిన యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఏడాది కిందట యువతీ కంపెనీలో ఉద్యోగం మానేసి వెళ్లిపోయినప్పటి నుంచి ప్రదీప్ ఆందోళనగా ఉంటున్నాడు. ఈ క్రమంలో అద్దెకున్న ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు.
చికిత్స పొందుతూ..
హవేళిఘణాపూర్(మెదక్): పురుగుల మందు తాగిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మెదక్ మండల పరిధిలోని తిమ్మక్కపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. తిమ్మక్కపల్లికి చెందిన ఆకుల నవీన్‌కుమార్ (33) కొంత కాలంగా మతిస్థిమితం సరిగా లేకపోవడంతో మద్యం తాగుతూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఇంటి వద్దకు వచ్చి వాంతులు చేసుకున్నాడు. ఏం జరిగిందని అడుగగా కల్లు దుకాణం వెనకాల గడ్డి మందు తాగానని చెప్పడంతో వెంటనే కుటుంబీకులు మెదక్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు.
అనుమానాస్పద స్థితిలో నవ వధువు..
నర్సాపూర్ రూరల్: నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని చిన్న చింతకుంటలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అవుసుల వెంకట చారికి వారం క్రితం నర్సాపూర్ మండలం అద్మాపూర్ గ్రామానికి చెందిన వడ్ల మాణిక్యం కూతురు భవాని అలియాస్ స్వాతి (19)తో పెద్దల సమక్షంలో పెళ్లి జరిపించారు. ఈ క్రమంలో బుధవారం బెడ్రూంలో ఉరివేసుకుంది. ఇష్టం లేని పెళ్లి చేయడంతో ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందినట్లు అత్తింటి వారు చెబుతున్నారు. మా కూతురుని పెళ్లయిన మరుసటి రోజు నుంచి వేధింపులకు గురిచేసి హత్య చేసి అత్తింటి వారు ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డి వివరణ కోరగా ఇంకా ఫిర్యాదు రాకపోవడంతో కేసు నమోదు చేయలేదని తెలిపారు. ఫిర్యాదు అందిన తర్వాత దర్యాప్తు చేపట్టి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
యూపీ యువకుడు ఆత్మహత్య


