ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
పటాన్‌చెరు: అమీన్‌పూర్ డివిజన్ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తెలిపారు. ఇందులోభాగంగా డివిజన్ పరిధిలోని వడకపల్లి, కిష్టారెడ్డిపేట, ఐలాపూర్, సుల్తాన్‌పూర్, దయార, పటేల్‌గూడ, ఐలాపూర్ తండా, జానకంపేట గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు తొలి ప్రాధాన్యతనిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అమీన్‌పూర్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్‌కుమార్, ఇంజనీరింగ్ ఈ.ఈ సురేశ్, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పీటీసీ సుధాకర్‌రెడ్డిలతో కలిసి విలీన గ్రామాల్లో శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే పర్యటించి అభివృద్ధి పనులపై సమీక్షించారు. గ్రామాల పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కిష్టారెడ్డిపేట గ్రామ పరిధిలోని జెడ్పీ హైస్కూల్ భవన నిర్మాణ పనులు నత్తనడక కొనసాగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వడకపల్లి గ్రామంలోని పురాతన కోట అభివృద్ధికి హెచ్‌ఎండీఏ నిధులు మంజూరు చేసిందని తెలిపారు. రూ.9.80 కోట్లతో కోట చుట్టూ రాక్ పార్కు అభివృద్ధి చేసేందుకు నిర్ణయించినట్లు వివరించారు. సుల్తాన్‌పూర్ గ్రామంలో మోల్డ్ టెక్ పరిశ్రమ సహకారంతో రూ.కోటితో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవన నిర్మించనున్నట్లు వెల్లడించారు. సుల్తాన్‌పూర్‌లో నూతనంగా నిర్మించిన ఫంక్షన్ హాల్, మల్లన్న దేవాలయాన్ని అతి త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. అమీన్‌పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలో జనాభాకనుగుణంగా మరో ఐదు డివిజన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు సత్యనారాయణ, రాజు,కృష్ణ, పాండు, శ్రీకాంత్, మల్లేష్, భాస్కర్ గౌడ్, మల్లేష్, శ్రీకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


