ప్రత్యామ్నాయ పంటలతోనే అధిక లాభాలు
శాస్త్రవేత్త మహాదేవప్ప
సిద్దిపేటరూరల్: రైతులు యాసంగిలో వరి పంటకు బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం, రాజేంద్రనగర్ ప్రధాన శాస్త్రవేత్త మహాదేవప్ప పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని బచ్చాయిపల్లి గ్రామంలో వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం రాజేంద్రనగర్, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో యాసంగి పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరికి బదులు మొక్కజొన్న , పొద్దు తిరుగుడు సకాలంలో వేసినట్లయితే యాసంగిలో అధిక ఉష్ణోగ్రత, వడగండ్ల వల్ల పంట నష్టం జరగకుండా, అధిక దిగుబడులు పొందవచ్చన్నారు. అనంతరం తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త పల్లవి మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పంటల వల్ల తక్కువ నీటితోపాటు కాల పరిమితి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఏఓ నరేశ్, సిద్దిపేట ఏడీఏ పద్మ, ఏఈఓ సుమిత్ర, సర్పంచ్ ప్రేమలత, ఉప సర్పంచ్ అరుణ, రైతులు పాల్గొన్నారు.


