గద్దర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్దాం
రామచంద్రాపురం(పటాన్‌చెరు): ప్రజాగాయకుడు గద్దర్ ఆశయాలను, సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ డా.వెన్నెల పేర్కొన్నారు. తెల్లాపూర్‌లో గద్దర్ విగ్రహం వద్ద గద్దర్ గళం వ్యవస్థాపక అధ్యక్షుడు కె.సత్తయ్య, మాజీ కౌన్సిలర్ కె.భరత్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన గద్దర్ జయంతి కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అంతకుముందు గద్దర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజల కోసం, ప్రజా ఉద్యమాల కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడు గద్దర్ అన్నారు. తన తండ్రి చివరి కోరిక మేరకు రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చినట్లు వివరించారు. ప్రధానంగా మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని కోరారు. మారుమూల గ్రామాలలో సైతం పర్యటించి ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రజలకు వివరించి చైతన్యవంతులను చేస్తామని తెలిపారు. అనంతరం గద్దర్ జయంతి సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జెరిపాటి జైపాల్, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, బీజేపీ రాష్ట్ర కో ఆర్టినేటర్ బాలయ్య, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ డా.వెన్నెల


