జాతర ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
ఝరాసంగం(జహీరాబాద్): మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీ కేతకీ సంగమేశ్వరాలయంలో నిర్వహించనున్న జాతర బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా పరిషత్ సీఈఓ జానకిరెడ్డి, ఆర్డీవో దేవుజా అధికారులకు ఆదేశించారు. ఝరాసంగం మండల ప్రజాపరిషత్తు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో జాతర ఏర్పాట్లపై వారు శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలుగురాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు వచ్చే అవకాశముందని, ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. మరుగుదొడ్లు, త్రాగునీరు, వసతి తదితర మౌలిక వసతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఆలయానికి వచ్చే రహదారులు వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. సమీక్షలో జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్, రూరల్ సీఐ హనుమంతు, ఎస్సై క్రాంతికుమార్‌పాటిల్, తహసీల్దార్ భాస్కర్, ఎంపీడీవో మంజుల, ఈవో శివ రుద్రప్ప, తదితరులు పాల్గొన్నారు.
అధికారులతో సమీక్షలో జెడ్పీసీఈఓ జానకిరెడ్డి


