ఆపరేటర్ తప్పిదం.. లైన్‌మెన్‌కు విద్యుత్ షాక్
చిన్నశంకరంపేట(మెదక్): విద్యుత్ సబ్‌స్టేషన్ ఆపరేటర్ నిర్లక్ష్యం.. లైన్‌మెన్ ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ సంఘటన మండలంలోని ధరిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. శుక్రవారం గ్రామంలో వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఫ్యూజ్‌వైర్ పోవడంతో లైన్‌మెన్ భిక్షపతి సబ్‌స్టేషన్ ఆపరేటర్ అజీజ్‌కు ఫోన్‌చేసి ఎల్‌సీ తీసుకున్నారు. సరఫరాను నిలిపివేశాడని ట్రాన్స్‌ఫార్మర్ వద్ద లైన్‌మెన్ ఫ్యూజ్ వేస్తుండగా చేయికి విద్యుత్ షాక్ తగిలి కిందపడిపోయాడు. గాయపడిన అతన్ని స్థానికులు వెంటనే హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. కాగా సబ్‌స్టేషన్‌లో ధరిపల్లి వ్యవసాయ పీడర్ విద్యుత్ సరాఫరా బంద్ చేయాల్సిన ఆపరేటర్.. భాగిర్థిపల్లి ఫీడర్ లైన్‌కు సరఫరా బంద్ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఏఈ దినకర్ తెలిపారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు నివేదిక పంపించినట్లు పేర్కొన్నారు.
గాలిపటాలు ఎగురవేస్తున్న క్రమంలో..
జహీరాబాద్ టౌన్: గాలిపటాలు ఎగరవేస్తున్న క్రమంలో కరెంట్ షాక్ తగిలి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం... బీహార్‌కు చెందిన నిరజ్, మనోజ్ జహీరాబాద్ సమీపంలో గల పరిశ్రమల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరు జహీరాబాద్ పట్టణంలోని బాబు మోహన్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. పండుగ సందర్భంగా గురువారం ఇంటిపై నిషేధిత చైనీస్ మాంజాతో గాలి పటాలు ఎగురవేస్తున్నారు. ఈ క్రమంలో మాంజా కరెంట్ తీగలకు తాకి షాక్ కొట్టి ఇద్దరికీ గాయాలయ్యాయి. స్థానికులు గాయపడిన వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఉస్మానియాకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆపరేటర్ తప్పిదం.. లైన్‌మెన్‌కు విద్యుత్ షాక్


