గుట్టుగా.. గుట్కా!
● యథేచ్చగా సాగుతున్న వ్యాపారం
● మొక్కుబడిగా అధికారుల తనిఖీలు
● అనారోగ్యాల బారిన పడుతున్న ప్రజలు
జహీరాబాద్ టౌన్: జిల్లా వ్యాప్తంగా గుట్టుగా గుట్కా దందా జోరుగా సాగుతోంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం గుట్కా, పాన్ మసాలా వంటి వాటిని నిషేధించినా విచ్చలవిడిగా అమ్మకాలు సాగుతున్నాయి. పట్టణాల నుంచి పల్లెల వరకు కిరాణ దుకాణాలు, పాన్ షాపుల్లో బహిరంగంగా విక్రహిస్తున్నారు. సంబంధిత అధికారుల మొక్కుబడిగా తనిఖీలు చేయడంతో వ్యాపారులు రెచ్చిపోతున్నారు. దీంతో నిషేధించిన గుట్కా దందా జిల్లాలో యఽథేచ్చగా సాగుతుంది. వివరాల ప్రకారం.. గుట్కాను ప్రభుత్వం నిషేధించగా కొంత మంది కర్ణాటక నుంచి జిల్లాలో గుట్కా విక్రయించి రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దులోని బీదర్ నుంచి వాహనాల్లో గుట్కా ప్యాకెట్లు మార్కెట్‌లోకి చేరుతున్నాయి. హోల్‌సేల్ వ్యాపారులు సిగరెట్లు, బీడీలు విక్రహించే వీధి వ్యాపారుల ద్యారా చిన్న దుకాణాలు, పాన్ షాపులకు సరపరా చేస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్రలో తయారైన సాగర్, గోవా, మాణిక్‌చంద్, తదితర పేర్లతో జిల్లా అంతటా దర్శనమిస్తున్నాయి. ప్రతి కిరాణ, పాన్ షాపుల్లో గుట్కా, కై నీ, పాన్ మసాలా వంటి వాటివి విక్రయిస్తున్నా.. అధికారులు తనిఖీ సమయాల్లో మాత్రం కనిపించడం లేదు. యువత గుట్కాకు బానిస అవుతుండగా దీనిని అదనుగా చేసుకొని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో రూ.10కి లభించే గుట్కా మసాలా రూ.20 నుంచి రూ. 30 వరకు అమ్ముతున్నారు.
రూ.లక్షల్లో ఆదాయం
గుట్కా బిజినెస్‌లో వ్యాపారులు లక్షల్లో సంపాదిస్తున్నారు. ఒక్క గుట్కా లారీ వ్యాపారి వద్దకు వస్తే కనీసం రూ. 20 లక్షల వరకు సంపాదన వచ్చినట్టే. ఈ నెల 10న బీదర్ పట్టణం నుంచి జహీరాబాద్ వస్తున్న గుట్కా లారీని కొంత మంది దుండగులు గంగ్వార్ వద్ద నిలిపి అపహరించారు. దోపిడికి పాల్పడిన ముఠాలోని ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రూ. 20 లక్షలకు పైగా విలువ చేసే గుట్కాను స్వాధీనం చేసుకున్నారు.
ఉక్కుపాదం మోపాలి
గుట్కాకు యువత బానిస అవుతోంది. గుట్కాకు అలవాటు పడిన వారు మానే పరిస్థితి కనిపించడం లేదు. ఉదయం లేచిన మొదలుకుని రాత్రి పడుకునే వరకు నోటిలో గుట్కా ఉంటుంది. గుట్కా, పాన్ మసాలా తినే వారు నోటి క్యాన్సర్ బారిన పడుతున్నారు. చాలా మంది రోగాల బారిన పడి చికిత్స పొందుతున్నారు. ఇప్పటికై నా జిల్లా అధికార యంత్రాగం ప్రజా ఆరోగాన్ని హాని చేసే గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.


