
పీటీఏల ఏర్పాటుపై వివరాలివ్వండి
రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో పేరెంట్, టీచర్ అసోసియేషన్(పీటీఏ)ల ఏర్పాటుపై వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సర్కార్ నుంచి సూచనలు పొంది చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదికి స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఆరు వారాలకు వాయి దా వేసింది. తెలంగాణ విద్యా చట్టం–1982లోని సెక్షన్ 30 ప్రకారం అన్ని విద్యా సంస్థల్లో పీటీఏను ఏర్పాటు చేయాల్సి ఉండగా.. అనేక చోట్ల ఆ మేరకు చర్యలు చేపట్టలేదంటూ సంగారెడ్డి జిల్లా కంది మండలం అల్లూర్ గ్రామానికి చెందిన ఉప్పు మల్లికార్జున్ పాటిల్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్, జస్టిస్ జీఎం మోహియుద్దీన్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. విద్యా వ్యవస్థను సంస్కరించడంలో భాగంగా, పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రులకు భాగ స్వామ్యం ఉండేలా, కనీస వసతులు, నిర్వహణపై పర్యవేక్షణ కోసం ప్రభుత్వం పీటీఏలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభమైన 30 రోజులలోపు పాఠశాల హెడ్ మాస్టర్ పీటీఏను ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. చాలా స్కూల్స్‌లో ఇది అమలు కావడం లేదన్నారు. చట్టంలోని నిబంధనల ప్రకారం ప్రతి పాఠశాలలో పేరెంట్–టీచర్ అసోసియేషన్ ఏర్పాటు చేసేలా అధికారులను ఆదేశించాలని కోరారు. ప్రభుత్వం తరపున స్పెషల్ జీపీ రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. అధికారుల నుంచి వివరాలు తెలుసుకుని సమర్పించేందుకు సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా వేసింది.