
పోలియోను నిర్మూలిద్దాం
సంగారెడ్డి/సంగారెడ్డి జోన్: జిల్లాలో 97.11% పల్స్ పోలియో కార్యక్రమం పూర్తయినట్లు కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. అన్ని శాఖల అధికారులతో కలిసి మొదటిరోజు 1,86,147 మంది చిన్నారులకు చుక్కలు వేసినట్లు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఆదివారం టీజీఐఐసీ చైర్మన్ నిర్మలారెడ్డితో కలిసి పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అమీన్‌పూర్‌లో పోలియో చుక్కల స్టాక్ లేదనటంలో వాస్తవం లేదని ఆమె స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అంచనా వేసిన దానికంటే 1,500 డోసుల పోలియో చుక్కల మందు పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలో సరఫరా చేసినట్లు తెలిపారు. గతంలో కంటే ఈసారి 60 కేంద్రాలు అదనంగా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ తిరిగి పల్స్ పోలియో చుక్కలు వేసి లక్ష్యాన్ని వంద శాతం పూర్తి చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలిద్దామని పిలుపునిచ్చారు. నిర్మలారెడ్డి మాట్లాడుతూ...ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పల్స్ పోలియో చుక్కలు, చిన్నపిల్లల వ్యాక్సినేషన్ కార్యక్రమాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుని తమ పిల్లలు ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
నేడు యథావిధిగా ప్రజావాణి
కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. సమస్యలను సంబంధిత అధికారులకు అందజేయడానికి ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకావచ్చని కలెక్టర్ సూచించారు.
97.11% పూర్తయిన పల్స్ పోలియో
కలెక్టర్ ప్రావీణ్య
పిల్లలకు పోలియో చుక్కలు
తప్పనిసరి: టీజీఐఐసీ చైర్మన్ నిర్మలారెడ్డి