
ఎన్నాళ్లీ ముంపు
మంజీరా బ్యాక్ వాటర్‌లో మునిగిన పంటలు
న్యాల్‌కల్(జహీరాబాద్): సాగు, తాగు నీటి కష్టాలు తీర్చే మంజీరానది పంటలను ముంచేస్తుంది. ప్రతి ఏటా ఈ నది బ్యాక్ వాటర్ వల్ల పరీవాహక ప్రాంతాల వెంట వందలాది ఎకరాల పంటలు నీటి పాలవుతున్నాయి. పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నష్టం వివరాలను సేకరించిన వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నా పరిహారం మాత్రం అందడం లేదని న్యాల్‌కల్ మండలంలోని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కర్నాటక, మహారాష్ట్ర నుంచి ప్రవహించే మంజీరా నది న్యాల్‌కల్ మండలం గుండా జిల్లాలోకి ప్రవేశిస్తుంది. జిల్లాలో కురిసే భారీ వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానల వల్ల మంజీరాలోకి పెద్ద ఎత్తున వరద చేరుతుంది. వరదలు వచ్చినప్పుడల్లా బ్యాక్ వాటర్ వల్ల పరీవాహక ప్రాంతాలైన మండల పరిధిలోని హుస్సేన్‌నగర్, చాల్కి, అమీరాబాద్, చీకూర్తి, కాకిజన్‌వాడ, ముర్తుజాపూర్, రాఘవాపూర్ శివారుల్లో పంటలు నీట మునుగుతున్నాయి. ప్రభుత్వం గుర్తించిన దానికంటే అధికంగా భూములు ముంపునకు గురవుతున్నాయని, తమకు న్యాయం చేయాలని రైతులు ఫిర్యాదు చేయడంతో గత 15 ఏళ్ల క్రితం అధికారులు సర్వేలు చేశారు. కానీ ఇప్పటి వరకు దాని ఫలితాలు మాత్రం ప్రకటించలేదని తెలిపారు. ప్రతిఏటా పంటలు నీట మునిగి తాము తీవ్రంగా నష్టపోతున్నామని అన్నదాతలు వాపోతున్నారు.
మంజీరాలోకి భారీ వరద
మంజీరా నదిలోకి ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. మూడు రోజులుగా వస్తున్న వరదల వల్ల నది పరీవాహక ప్రాంతాల్లోని పంటలు నీట మునుగుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సుమారు 500 ఎకరాల్లో పంటలు నీట మునిగింది. ప్రస్తుతం మంజీరాలో వరద ప్రవాహం పెరుగుతుండటంతో సుమారు వెయ్యి ఎకరాల వరకు పత్తి, సోయా పంటలు నీట మునిగినట్లు అధికారులు అంచనా వేశారు. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా చీకూర్తి గ్రామ సమీపంలో గల వంతెన నీట మునడంతో రాకపోకలను అధికారులు నిలిపి వేశారు.
పరిశీలించిన అధికారులు
చీకూర్తి గ్రామ సమీపంలో గల ఇళ్ల వద్దకు బ్యాక్ వాటర్ రావడంతో మంగళవారం డిప్యూటీ తహసీల్దార్ రాజిరెడ్డి, హద్నూర్ ఎస్‌ఐ సుజిత్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శ్యామ్‌రావు తదితరులు గ్రామాన్ని సందర్శించారు. ఇళ్ల వద్దకు చేరిన నీటిని పరిశీలించారు. మూడు కుటుంబాలను తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలించారు.
ప్రతి ఏటా వందలాది ఎకరాల్లో నష్టం
పరిహారం అందించాలని కోరుతున్న రైతులు

ఎన్నాళ్లీ ముంపు

ఎన్నాళ్లీ ముంపు