కొను‘గోల్‌మాల్‌’..! | - | Sakshi
Sakshi News home page

కొను‘గోల్‌మాల్‌’..!

Sep 25 2025 1:43 PM | Updated on Sep 25 2025 1:43 PM

కొను‘గోల్‌మాల్‌’..!

కొను‘గోల్‌మాల్‌’..!

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: చేప పిల్లల కొనుగోలు ప్రక్రియలో గోల్‌మాల్‌ జరుగుతోందా? అర్హత లేనివారికి ఈ చేపపిల్లల సరఫరా క్రాంటాక్టును కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారా? ఈ టెండరు ప్రక్రియ నిర్వహణలో సంబంధిత అధికారులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారా? అంటే అవుననే ఆరోపణలు వినవస్తున్నాయి. గత ప్రభుత్వ హయాం మాదిరిగానే ఈసారి కూడా ప్రభుత్వం చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలు వదలాలని నిర్ణయించింది. ఇందుకోసం చేప పిల్లలను కొనుగోలు చేసేందుకు మత్స్యశాఖ టెండరు నోటిఫికేషన్‌ జారీ చేసింది. అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ నాయకుడి ఒత్తిడి మేరకు అధికారులు ఇలా నిబంధనలను తుంగలో తొక్కి సరఫరా కాంట్రాక్టును కట్టబెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

3.49 కోట్ల చేపపిల్లల

కొనుగోలుకు నిర్ణయం!

జిల్లాలో మొత్తం 1,135 చెరువులు ఉన్నాయి. ఇందులో 1,053 చెరువుల్లో చిన్న చేప పిల్లలు (సైజు 35 ఎంఎం – 40 ఎంఎం) వదలాలని నిర్ణయించారు. అలాగే సింగూరు, నల్లవాగు, మిలిగేరి రిజర్వాయర్లతోపాటు, 82 పెద్ద చెరువుల్లో పెద్ద సైజు (80 –100 ఎంఎం) చేపపిల్లలను వదలాలని భావిస్తున్నారు. ఇందుకోసం 2.03 కోట్ల చిన్న సైజు, 1.45 కోట్ల పెద్ద సైజు చేపపిల్లలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇందులో మత్య్సశాఖ టెండరు ప్రక్రియ చేపట్టింది. ఒకే ఒక్క కాంట్రాక్టరు బిడ్‌ దాఖలు చేసినట్లు తెలిసింది. చిన్న సైజు చేప పిల్లకు 68 పైసల చొప్పున, పెద్ద సైజుకు రూ.1.78ల చొప్పున సరఫరా చేసేందుకు బిడ్‌ వేశారు. ఇదే కాంట్రాక్టరుకు అధికారులు సరఫరా బాధ్యతలను అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

గతేడాది కంటే ఎక్కువ ధర

2024–25 ఆర్థిక సంవత్సరంలో 80 –100 ఎంఎం సైజు ఒక్కో చేప పిల్లకు రూ.1.73 చొప్పున సరఫరా జరిగింది. అయితే ఈసారి ఏకంగా ఈ రేటు రూ.1.78లకు బిడ్డింగ్‌ వేశారు. ఇలా కోట్లలో చేప పిల్లలు కొనుగోలు చేస్తే ప్రభుత్వ ఖజానాకు ఎంత మొత్తంలో గండి పడుతుందో అర్థం చేసుకోవచ్చు.

నిబంధనలకు విరుద్ధంగా..

● చేప పిల్లలు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు తప్పనిసరిగా వాటిని ఉత్పత్తి చేసే చెరువులు ఉండాలి. కానీ కేవలం చేపల పెంపకం చెరువులు మాత్రమే ఉన్న కాంట్రాక్టరుకు ఈ చేప పిల్లలు సరఫరా చేసే కాంట్రాక్టును అధికారులు కట్టబెడుతుండటం గమనార్హం.

● సంబంధిత కాంట్రాక్టరుకు చేపపిల్లలు ఉత్పత్తి చేసే చెరువు ఉందా? లేదా అనేది నిర్ధారించేందుకు మత్స్య, పశుసంవర్థక, రెవెన్యూ శాఖల అధికారులు ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని కై కలూరుకు వెళ్లి పరిశీలించారు. అయితే ఈ పరిశీలన మొక్కుబడిగా సాగిందనే ఆరోపణలున్నాయి.

● ఏదైనా టెండరు ప్రక్రియలో సింగిల్‌ (ఒకే ఒక్క) బిడ్డర్‌ పాల్గొంటే ఆ టెండర్లను రద్దు చేయాలి. కానీ సింగిల్‌ టెండరు వేసిన కాంట్రాక్టరుకు ఈ సరఫరా కాంట్రాక్టును కట్టబెడుతుండటం వెనుక ఆంతర్యమేంటనేది అధికారులకే తెలియాలి.

నిబంధనలను అమలు చేశాం

దరు కాంట్రాక్టరుకు అన్ని అర్హతలు ఉన్నాయి. హ్యాచరీస్‌ లేకపోయినప్పటికీ గుడ్లను ఇతరుల వద్ద తీసుకొచ్చి విత్తన చేపపిల్లలను ఉత్పత్తి చేసి సరఫరా చేయడానికి వీలుంటుంది. మేము స్వయంగా వెళ్లి ఈ చేపల చెరువులను పరిశీలించాం. చేప పిల్లల ధర తగ్గించాలని సదరు కాంట్రాక్టరుతో నెగోషియేషన్‌ (బేరం ఆడుతాము) చేస్తున్నాం. రేటు తగ్గించాలని కోరుతున్నాం. ఈ టెండరు ప్రక్రియ నిబంధనల మేరకే నిర్వహిస్తున్నాం. – ఆర్‌.ఎల్‌.మధుసూధన్‌,

అసిస్టెంట్‌ డైరెక్టర్‌, ఫిషరీస్‌.

చేప పిల్లల టెండరు ప్రక్రియలో అవకతవకలు

అర్హత లేనివారికి

కాంట్రాక్టు ఇచ్చేందుకు రంగం సిద్ధం!

నిబంధనలకు విరుద్ధంగా

టెండర్ల ప్రక్రియ

అలాంటిదేమీ లేదంటున్న అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement