
దసరా సందడి
సంగారెడ్డి జోన్: బతుకమ్మ, దసరా పండుగలు సమీపిస్తుండటంతో కొనుగోలుదారులతో మార్కెట్ అంతా సందడిగా కనిపిస్తోంది. ప్రతీ ఒక్కరు నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తుండటంతో దుకాణాల్లో రద్దీ నెలకొంది. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంతోపాటు పటాన్‌చెరు, నారాయణఖేడ్, జహీరాబాద్, అందోల్, సదాశివపేట తదితర పట్టణాలకు గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివస్తున్నారు.
వారికి నచ్చేలా మెచ్చేలా...
వస్త్ర దుకాణాలు, షాపింగ్ మాల్స్‌లలో నిర్వాహకులు వినియోగదారులను ఆకట్టుకునేందుకు రాయితీలతోపాటు స్పాట్, డ్రా గిఫ్టులు ఏర్పాటు చేస్తున్నారు. డ్రా గిఫ్టులలో కార్లతోపాటు బైకులు అందుబాటులో ఉంచారు. ఒక్కో దుకాణదారుడు ఇతర దుకాణాలతో పోటీ పడుతూ తగ్గింపు ధరలతో విక్రయిస్తున్నారు. మరికొంతమంది దుకాణదారులు సినీ సెలబ్రిటీలతో ప్రారంభోత్సవాలు చేయించి వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు.
రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు
జిల్లావ్యాప్తంగా 150కి పైగా వస్త్ర దుకాణాలున్నాయి. ఆయా దుకాణాల్లో సరసమైన ధరల్లో వస్త్రాలను అందుబాటులో ఉంచారు. ఈ ఏడాది సుమారు రూ.15 నుంచి రూ.20 కోట్ల వరకు వ్యాపారాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాత్రి 11గంటలు దాటినా కొనుగోళ్లు జరుగుతున్నాయి.
ఆన్ లైన్‌లోనూ కొనుగోళ్లు
మారుతున్న కాలానికి అనుగుణంగా వస్త్ర దుకాణాలతోపాటు ఆన్‌లైన్‌లోనూ కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, మీషో, మింత్రా తోపాటు తదితర వెబ్ సైట్ల ద్వారా కూడా దుకాణదారులు ప్రత్యేక ఆఫర్లు కల్పిస్తున్నారు. తాము కల్పిస్తున్న ఆఫర్లతో ప్రధాన చౌరస్తాలో బ్యానర్లు వేసి, ఆటోలతో ప్రచారాలు చేస్తున్నారు. అదేవిధంగా ఆన్‌లైన్ ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ ద్వారా ప్రచారం చేస్తున్నారు.
తగ్గిన జీఎస్టీతో పెరిగిన అమ్మకాలు
ఇటీవల పలు వస్తువులపై ఉన్న జీఎస్టీని తగ్గించారు. గతంలో 28% ఉన్న జీఎస్టీ ప్రస్తుతం 18%కి తగ్గించడంతో వాటి అమ్మకాలు పెరిగాయి. ఎలక్ట్రానిక్ వస్తువులతోపాటు వాహనాలపై వాటి విలువలను బట్టి ధరలు తగ్గాయి.
దుకాణాల్లో పెరుగుతున్న రద్దీ
రాయితీలు, బహుమతులతో
ఆకర్షిస్తున్న దుకాణదారులు
కిటకిటలాడుతున్న మార్కెట్లు