
రూ.16.28కోట్లతో పట్టణాభివృద్ధి
నారాయణఖేడ్: ఖేడ్ పట్టణాన్ని రూ.16.28కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. ఖేడ్ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రూ.15కోట్ల నిధులతో ఖేడ్ జంట గ్రామమైన మంగల్‌పేట్ నుంచి రాజీవ్‌చౌక్ వరకు మురుగు కాల్వలు, సీసీ నిర్మాణంతో పాటు రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నామన్నారు. గతంలో ప్రతిపాదించిన మేర 70 అడుగుల మేర రహదారిని విస్తరించనున్నట్లు తెలిపారు. ఉపయోగం లేని డివైడర్లను తొలగించి రోడ్డు విస్తరిస్తూ రహదారులను సుందరీకరణ చేయనున్నట్లు చెప్పారు. బసవేశ్వర చౌక్ నుంచి శివాజీచౌక్ మీదుగా రోడ్డు డివైడర్ల నిర్మాణంతోపాటు బటర్‌ఫ్లై లైట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇంటి ట్యాక్సుల కలెక్షన్లతోపాటు, ఇతరత్రా అంశాల్లో ఉత్తమ మున్సిపాలిటీగా గుర్తించడంతో మంజూరైన రూ.1.28కోట్లతో పట్టణంలో ప్రధాన జంక్షన్లను అభివృద్ధి చేస్తామన్నారు. బైపాస్ రోడ్డు పనులు త్వరగా చేపట్టేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
దసరా ఉత్సవాలు...
మున్సిపాలిటీ ద్వారా దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, రావణ దహనం ఏర్పాట్లు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి చెప్పారు. పట్టణంలోని బతుకమ్మ సంబురాలకు బతుకమ్మ ఘాట్‌వద్ద ఏర్పాట్లు చేస్తున్నామని, విద్యుత్ స్తంభాలు సైతం బిగిస్తున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దారం శంకర్, మాజీ ఎంపీటీసీ పండరీరెడ్డి, నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, యాదవరెడ్డి, సంగన్న పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సంజీవరెడ్డి