
అసంపూర్తిగా డబుల్ ఇళ్లు
హత్నూర (సంగారెడ్డి): గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పేదల కోసం నిర్మించతలపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ఇళ్లు లేని పేదలకు డబుల్ బెడ్రూమ్ నిర్మిస్తుంటే లబ్ధిదారులు ఆశతో ఎదురు చూశారు. కానీ ఏళ్లు గడిచినా ఆ భవనాలకు సంబంధించిన పనులు పూర్తికాకపోవటంతో లబ్ధిదారులు నిరాశకు లోనయ్యారు. పునాది, గోడలు లేక, శ్లాబ్ వేసి వదిలేసినవి జిల్లాలో 602 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు దర్శనమిస్తున్నాయి. చిన్న చిన్న సమస్యలు, నల్లా ట్యాపులు లేకపోవడం, విద్యుత్ వైర్లు బిగించకపోవడం, కిటికీలు, తలుపులు బిగించకపోవడం వంటివాటితో మరో 932 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిరుపయోగంగా ఉన్నాయి.
కాంట్రాక్టర్లకు రూ.4కోట్ల వరకు బకాయిలు
డబుల్ బెడ్రూమ్ భవన నిర్మాణాల కాంట్రాక్టర్లకు సుమారు జిల్లాలో రూ.4 కోట్ల వరకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉండగా బాకీలను ఇవ్వకపోవడంతోనే పూర్తిస్థాయిలో కాంట్రాక్టర్లు నిర్మాణాలను చేపట్టలేకపోయారన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇల్లు లేని పేదలకు స్థలం ఉన్నచోట లబ్ధిదారులకు రూ.5లక్షలను మంజూరు చేసేందుకు శ్రీకారం చుట్టింది. దీంతో గత ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అసంపూర్తి భవనాలకు నిధులు మంజూరు చేయకపోవడంతో కోట్లాది రూపాయలు బూడిదలో పోసిన పన్నీరుగా మారింది.
పరిశీలనలో ఉంది
జిల్లాలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్య రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టిలో ఉంది. జిల్లాలో సుమారు రూ.4 కోట్లు వరకు కాంట్రాక్టర్లకు చెల్లింపు విషయంలోనే పనులు ఆగిపోయాయి. 932 డబుల్ బెడ్రూమ్‌లకు మిగిలి ఉన్న పనులను పూర్తి చేసి పంపిణీ చేసేందుకు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాం. 15 రోజుల్లో ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు అందించేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నాం.
– చలపతిరావు.పీడీ, గృహ నిర్మాణ శాఖ
జిల్లాలో 602 పూర్తికాని ఇళ్లు
చిన్నచిన్న సమస్యలతో 932 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు
రూ.4 కోట్ల చెల్లింపుల్లో జాప్యం