
సింగూరు డ్యామ్ పటిష్టతకు చర్యలు
పుల్‌కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టు పటిష్టతకోసం చర్యలు తీసుకుంటున్నామని గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు చైర్మన్ బీపీ పాండే పేర్కొన్నారు. గోదావరి నది పరీవాహకంలో భాగమైన సింగూరు ప్రాజెక్టును బోర్డు సభ్యులు, నీటిపారుదల రంగం నిపుణులతో కలిసి బుధవారం సందర్శించారు. ప్రాజెక్టుకు డ్యామ్ సేఫ్టీ అధికారులు సూచించిన మేరకు పటిష్టతకోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సింగూరు ప్రాజెక్టు నీటి సామర్థ్యం 29.9 టీఎంసీలైన డీఆర్‌పీ అధికారుల సూచన మేరకు 17 టీఎంసీలకు కుదించి మిగతా నీటిని దిగువకు వదులుతున్నామని తెలిపారు. డ్యామ్ మరమ్మతుల కోసం డ్యామ్ రిహబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రాం(డీఆర్‌ఐపీ,డ్రిప్)క్రింద ఎంపిక చేశామని తెలిపారు. ఈ పథకం ద్వారా డ్యామ్ మరమ్మతులు చేయాలని నిర్ణయించామన్నారు. డ్యామ్ మట్టికట్టకు పడిన బుంగను పరిశీలించారు. నీటి నిల్వ సామర్థ్యం తగ్గించినందున డ్యామ్‌కు ప్రమాదమేమి లేదని తెలిపారు. ప్రాజెక్టు మట్టికట్టకు మట్టిపరీక్షలు చేయాలని అధికారులకు సూచించారు. మట్టి పరీక్షలు చేయడం వల్ల మట్టి నాణ్యతను పరీక్షించి మరమ్మతులు చేయడానికి సులభమవుతుందని తెలిపారు. ప్రాజెక్టు వద్ద శ్రమదానం చేసి పిచ్చి మొక్కలను తొలగించారు. జీఆర్‌ఎంబీ చైర్మన్ వెంట బోర్డు సభ్యులు ఆర్‌ఎం రంగరాజన్, షర్మిల, ఎస్‌ఈ పోచమల్లు, ఈఈ బీం, డీఈ నాగరాజు, ఏఈలు మహిపాల్‌రెడ్డి, స్టాలిన్ పాల్గొన్నారు.
సింగూరుకు భారీ వరద
సింగూరు ప్రాజెక్టుకు ఎగువనుంచి భారీ వరదలు రావడంతో దిగువకు 70 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న వరదంతా డ్యామ్‌లోకి చేరుకుంటోంది. ప్రాజెక్టులో 17 టీఎంసీల నీటిని నిల్వ ఉంచి మిగతా నీటిని దిగువకు ఏడు గేట్‌ల ద్వారా కిందికి వదులుతున్నారు.
మట్టి పరీక్షలకు సూచన
డీఆర్‌ఐపీ పథకంలో మరమ్మతులు
డ్యామ్‌ను సందర్శించిన
జీఆర్‌ఎంబీ చైర్మన్ బీపీ పాండే

సింగూరు డ్యామ్ పటిష్టతకు చర్యలు