
క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట
రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి
దుబ్బాక : గత ప్రభుత్వం పదేళ్లలో క్రీడల కోసం 350 కోట్లు కేటాయిస్తే, సీఎం రేవంత్‌రెడ్డి రెండేళ్లలో రూ.850 కోట్లు కేటాయించారని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. మంగళవారం దుబ్బాక మున్సిపల్ లచ్చపేట మాడల్ స్కూల్‌లో పీవీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో జరిగిన వాలీబాల్ పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడల్లో నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్లిన విద్యార్థులకు పీడీ(ఫిజికల్ డైరెక్టర్), క్రీడా అభివృద్ధి శాఖల అధికారులుగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచనను సీఎం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. క్రీడా అకాడమీలను పెట్టి క్రీడాకారులను తయారు చేయడంపై దృష్టి సారించామని చెప్పారు. క్రీడల్లో దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం కప్‌ను గ్రామస్థాయి నుంచి నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షులు పన్యాల శ్రావణ్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమేశ్‌కుమార్ తదితరులు ఉన్నారు.