
విద్యుదాఘాతంతో తాపీమేస్త్రి మృతి
వెల్దుర్తి(తూప్రాన్) : తాపీమేస్త్రి విద్యుదాఘాతంతో మృతిచెందాడు. ఈ ఘటన మండల కేంద్రం వెల్దుర్తిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాజు వివరాల ప్రకారం... బీహార్‌కు చెందిన పలువురు భవన నిర్మాణ కార్మికులు బతుకుదెరువు కోసం వలసవచ్చి ఓ కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నారు. వారంతా కాంట్రాక్టర్‌కు చెందిన డబుల్ బెడ్ రూంలో ఉంటున్నారు. రోజూమాదిరిగా సోమవారం పనికి వెళ్లి రాత్రి రూముకు వచ్చే సరికి ఇంట్లో కరెంట్ లేకపోవడంతో డాబాపైకి వెళ్లి పరిశీలించగా విద్యుత్ తీగ తెగిపోయి ఉంది. భారీ వర్షం కురుస్తుండగానే గొడుగు పట్టుకొని విద్యుత్ తీగలు అతికిస్తుండగా నారాయణశర్మ(37)కు ప్రమాదవశాత్తు షాక్ తగలడంతో వెనక ఉన్న పిల్లర్‌పై పడిపోయాడు. దీంతో తలకు బలమైన గాయం కావడంతో స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే తూప్రాన్ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు.