
ఉచిత శిక్షణ.. ఉపాధి
ఉపాధితో పాటు రుణాలు లబ్ధి పొందుతున్న మహిళలు
సంగారెడ్డి టౌన్ : గ్రామాల్లోని నిరుద్యోగులు, మహిళలు స్వయం ఉపాధి పొందడానికి నైపుణ్య శిక్షణను ఉచితంగా అందిస్తున్నాయి. ఎస్‌బీఐ వంటి బ్యాంకులు ఈ సంస్థలను నిర్వహిస్తూ, శిక్షణ పొందిన వారికి వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి ఆర్థిక సహాయం అందిస్తున్నాయి. మహిళలు స్వయం సమృద్ధి సాధించి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఈ శిక్షణ సహాయపడుతుంది. శిక్షణ నిస్తూ ఉపాధి కల్పిస్తూ వారి బంగారు భవిష్యత్‌కు సంగారెడ్డిలోని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ బాటలు వేస్తోంది.
ఎస్బీఐ సౌజన్యంతో మహిళలకు అనేక రంగాల్లో ఉచితంగా శిక్షణ ఇస్తూ ఆర్థిక భరోసాను కల్పిస్తోంది. శిక్షణతోపాటు ఉచితంగా భోజనం, వసతి కల్పించడమే కాకుండా వ్యాపార రుణాలను సైతం మంజూరు చేయిస్తుంది. వేలాది మంది ఉద్యోగాలు పొంది స్థిరపడ్డారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు చెందిన మహిళలకు టైలరింగ్, మగ్గం వర్క్, కుట్టు మిషన్, బ్యూటీ పార్లర్, కంప్యూటర్ శిక్షణ, కోర్సులను ఉచితంగా అందజేస్తున్నారు. వారితో పాటు పురుషులకు మోటార్ వెహికల్, ఫొటోగ్రఫీ, సీసీ కెమెరా, వైరింగ్‌లో శిక్షణతోపాటు భోజనం సదుపాయం కల్పిస్తున్నారు. శిక్షణ అనంతరం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సర్టిఫికెట్లు, కోర్సుకు సంబంధించిన కిట్లను అందజేస్తున్నారు. వేలాది మంది నిరుద్యోగ మహిళలు శిక్షణ తీసుకునేందుకు తరలివస్తున్నారు.
మహిళలకు బాసటగాగ్రామీణ ఉపాధి శిక్షణ సంస్థ
ఇప్పటి వరకు.. 448 బ్యాచ్‌లు
2010 జూన్ 7వ తేదీన ప్రారంభమైన ఈ శిక్షణ సంస్థ ద్వారా ఇప్పటి వరకు 448 బ్యాచ్‌లు శిక్షణ ఇవ్వగా అందులో మహిళలు, పురుషులు 11,898 శిక్షణ తీసుకున్నారు. కాగా 9138 మంది వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. వారిలో 3347 మందికి బ్యాంకు రుణాలు మంజూరయ్యాయి. శిక్షణలో భాగంగా వ్యక్తిత్వ వికాసం, వ్యాపార సంబంధ బ్యాంకింగ్ విషయాలపై సైతం అవగాహన కల్పిస్తున్నారు. 30 రోజులపాటు పూర్తిగా శిక్షణ ఇస్తున్నారు. మహిళలు షాపులను ఏర్పాటు చేసుకునేందుకు బ్యాంకుల ద్వారా రూ.50 వేల నుండి రూ.5 లక్షల వరకు రుణాలు అందజేస్తున్నారు. వారు ఉపాధి పొందడంతో పాటు మరో నలుగురికి శిక్షణ ఇస్తున్నారు.

ఉచిత శిక్షణ.. ఉపాధి