
పైసల్లేవు.. పండుగెట్లా!
● ఆర్థిక ఇబ్బందుల్లో కార్యదర్శులు ● 18 నెలలుగా విడుదల కాని నిధులు ● అకౌంట్ ఫ్రీజింగ్‌తో క్లియర్ కానీ చెక్కులు ● గ్రామాల్లో బతుకమ్మ, దసరాపై ప్రభావం
ప్రత్యేకాధికారుల పాలనలో పంచాయతీ కార్యదర్శులు పండుగ కూడా జరుపుకోలేని దుస్థితి ఏర్పడింది. ఏడాదిన్నరగా గ్రామాల్లో చేపట్టిన పారిశుద్ధ్య పనులు, తాగునీటి సరఫరా వంటి పనులకు ఇంతవరకు నిధులు విడుదల కాకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు ఆర్థికంగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
రాయికోడ్(అందోల్): సంగారెడ్డి జిల్లాలో 647 గ్రామ పంచాయతీలుండగా 633 మంది పంచాయతీ కార్యదర్శులున్నారు. గ్రామాల్లో వివిధ పనుల కోసం కార్యదర్శులే సొంతంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. బిల్లుల కోసం చెక్కులు పంపితే ట్రెజరీలో అకౌంట్ ఫ్రీజింగ్ ఉందని, అప్పులు చేసి నెట్టుకొస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న గ్రామ పంచాయతీల్లో 2 పెద్ద పంచాయతీల్లో 6 లక్షల వరకు తమ జేబుల్లోంచి ఖర్చు చేసినట్లు పేర్కొంటున్నారు. బిల్లులు అందించాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. జీపీలకు నేరుగా వచ్చే ఆదాయాన్ని రోజు వారీ ఖర్చులకు వినియోగించేకునేలా అనుమతులిస్తే ఇంతలా ఇబ్బందులు ఉండవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
పండుగలపై ప్రభావం
బిల్లులు పెండింగ్‌లో ఉండటం, కార్యదర్శులు అప్పుల్లో కూరుకుపోవడంతో బతుకమ్మ, దసరా పండుగల కోసం చేసే ఏర్పాట్లపై ప్రభావం పడనుంది. రాష్ట్ర ప్రభుత్వం ట్రెజరీలో ఫ్రీజింగ్ ఎత్తివేసి, ప్రత్యేక నిధులు విడుదల చేయాలని కార్యదర్శులు కోరుతున్నారు. ఇక గ్రామ పంచాయతీల్లో పనిచేసే మల్టీపర్పస్ వర్కర్లకు 3 నెలలుగా వేతనా లు రాలేదు. దీంతో వారితో పని చేయించడానికి కార్యదర్శులు నానా తంటాలు పడుతున్నారు. జిల్లాలో పని చేస్తున్న 28 మంది అవుట్ సోర్సింగ్ కార్యదర్శులకూ 7 నెలలుగా వేతనాలు అందక ఎదుర్కొంటున్న ఇబ్బందులు పడుతున్నారు. మొత్తంగా ప్రత్యేక పాలనలో అటు ప్రజలు, ఇటు కార్యదర్శులు, సిబ్బందికి అవస్థలు తప్పడం లేదు.
18 నెలలుగా బిల్లులు లేవు
18 నెలలుగా బిల్లులు రాక ఒక్కో కార్యదర్శి రూ.లక్ష నుంచి రూ.6 లక్షల వరకు సొంతంగా ఖర్చు చేశారు. బిల్లులు రాక చేసిన అప్పులు తీర్చలేక మనోవేదనకు గురవుతున్నారు. జీపీ నిధులు విడుదల రాకుండా ట్రెజరీలో ఫ్రీజింగ్ పెట్టారు. గ్రామాల్లో కనీస అవసరాల కోసం డబ్బు లేకపోవడంతో అత్యవసర పనులు మాత్రమే చేయిస్తున్నారు. జీపీలకు నేరుగా వచ్చే ఆదాయం జమ, ఖర్చుల కోసం ప్రతీ గ్రామ పంచాయతీకి ప్రత్యేక అకౌంట్‌ను ఏర్పాటు చేయిస్తే ఊరట లభిస్తుంది.
– రమేశ్, టీపీఎస్‌ఏ జిల్లా అధ్యక్షుడు
సొంతంగా రూ.3 లక్షలు ఖర్చు చేశాను
నిధులు విడు దల కాకపోవడంతో నిత్యం తప్పని సరిగా చేయాల్సిన పనుల కోసం రూ.3 లక్షలు సొంతంగా ఖర్చు చేశాను. దసరా కోసం అప్పు చేసి వీధి బల్బులు వేయించాల్సి వస్తోంది. నిధులు లేక ఆశించిన స్థాయిలో గ్రామాల్లో పనులు చేయలేకపోతున్నాం. ఉన్నతాధికారులు స్పందించి బిల్లులు అందేలా చూడాలి.
–శివశంకర్, పంచాయతీ కార్యదర్శి రాయికోడ్

పైసల్లేవు.. పండుగెట్లా!

పైసల్లేవు.. పండుగెట్లా!