
వరి విత్తనోత్పత్తితో ఆదాయం
మిరుదొడ్డి(దుబ్బాక): వరి విత్తనోత్పత్తితో రైతులు మరింత ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, తోర్నాల శాస్త్రవేత్త డా. సీహెచ్ పల్లవి తెలిపారు. శనివారం అక్బర్‌పేట–భూంపల్లి మండల పరిధిలోని మోతె గ్రామంలో గ్రామ గ్రామాన నాణ్యమైన విత్తనం కార్యక్రమంలో భాగంగా జేజీఎల్–24423 వరి విత్తనం సాగు చేస్తున్న పొలాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిశోధన కేంద్రాల్లో శుద్ధి చేసిన నాణ్యమైన వరి విత్తనాలను ఒక్కో గ్రామానికి చెందిన ముగ్గురు రైతులకు సాగుకు ఇచ్చామన్నారు. ఈ సాగును యాజమాన్య పద్ధతులు పాటించి మంచి దిగుబడులు సాధించి ఇతర రైతులకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సత్యాణ్వేష్, ఏఈఓ మహేశ్, మాజీ సర్పంచ్ కాలేరు శ్రీనివాస్, రైతులు రాజేశ్వర్, జన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.