
ట్రాక్టర్, బైక్ ఢీ..
పటాన్‌చెరు టౌన్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ శ్రీశైలం వివరాల ప్రకారం... ఇంద్రేశం సిటిజన్ కాలనీకి చెందిన నంద కుమార్ (22) అతడి బావ లక్ష్మణ్ వద్ద ఉంటూ పాశమైలారం పారిశ్రామికవాడలో ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం డ్యూటీకి బైక్‌పై వెళ్తుండగా ముత్తంగి సర్వీస్ రోడ్డులో జీపీఆర్ వెంచర్ నుంచి రోడ్డు పైకి పటాన్‌చెరు వైపు వస్తున్న ట్రాక్టర్ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో నందకుమార్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుడి బావ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అదుపు తప్పి.. చెట్టును ఢీకొట్టి..
కొల్చారం(నర్సాపూర్): వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని ఎనగండ్ల గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన కొరబోయిన శ్రీశైలం(32) దుంపలకుంట చౌరస్తాలో పంక్చర్ దుకాణం నడుపుతూ భార్య పిల్లలతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రాత్రి గిరాకీ ఉండటంతో ఇంటికి వెళ్లడం ఆలస్యమైంది. పని ముగియగానే తన బైక్ పై ఇంటికి వస్తున్నాడు. గ్రామ శివారులోని మామిడి చెరువు కట్ట వద్దకు రాగానే బైక్ అదుపు తప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. దీంతో శ్రీశైలం తలకు, ఇతర భాగాల్లో తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఐదేళ్లలోపు కూతురు, కుమారుడు ఉన్నారు.
యువతి అదృశ్యం
నర్సాపూర్ రూరల్: ఓ యువతి అదృశ్యమైంది. ఎస్సై లింగం వివరాల ప్రకారం.. మండలంలోని కోక్య తండాకు చెందిన లున్సావత్ బిక్యా కూతురు కవిత(21) ఈనెల 18న రాత్రి నుంచి కనిపించకుండా పోయింది. అదే రోజు కుటుంబ సభ్యులు చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
యువకుడి ఆత్మహత్య
కొమురవెల్లి(సిద్దిపేట): ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం... మండలంలోని గౌరాయపల్లి గ్రామానికి చెందిన పెద్ది మధుసూదన్ రెడ్డి(24) వ్యవసాయ పనుల నిమిత్తం మధ్యాహ్నం తన పొలం దగ్గరకు వెళ్లి పురుగుల మందు తాగాడు. కొట్టు మిట్టాడుతుండగా స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. దీనిపై పోలీసులను వివరణ కోరగా ఇంత వరకు ఎవరు ఫిర్యాదు చేయలేదని తెలిపారు.