
సాగులో మార్పులు అవసరం
గ్లోబల్ యాక్షన్, లోకల్ ప్రొడక్షన్ పద్ధతిలో పంటల సాగు జరగాలి వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహపాత్ర పర్యావరణ మార్పుల ప్రభావంపై ములుగులో జాతీయ సదస్సు
ములుగు(గజ్వేల్): పర్యావరణ మార్పులను సమష్టిగా ఎదుర్కొంటేనే మానవాళితోపాటు వ్యవసాయ, ఉద్యానరంగాలను కాపాడుకోవచ్చని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహపాత్ర అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగులోని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, ఉద్యాన శాఖ, నాబార్డ్, ఎర్త్‌సైన్సెస్, డాక్టర్ రాజేంద్రప్రసాద్ అగ్రికల్చర్ యూనివర్సిటీలు పర్యావరణ మార్పుల ప్రభావంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ములుగు ఉద్యాన విశ్వవిద్యాలయం వేదికగా రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యతిథిగా హాజరై ప్రసంగించారు. చిన్న, సన్నకారు రైతాంగంపై పర్యావరణ మార్పుల ప్రభావం తగ్గించేందుకు అన్నిరకాల ప్రయత్నాలు జరగాలన్నారు. పర్యావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు రైతులు, ప్రజలతో పాటు వాతావరణ శాఖను ఇబ్బంది పెడుతోందన్నారు. ప్రస్తుతం నెలకొన్న పర్యావరణ మార్పులకు అనుగుణంగా సాగులో మార్పుతో పాటు పంటల ఎంపిక తగిన విధానాలు మార్చుకోవాలన్నారు. గ్లోబల్ యాక్షన్, లోకల్ ప్రొడక్షన్ పద్ధతిలో పంటల సాగు జరగాలన్నారు. వాతావరణంలో మార్పులకు సంబంధించిన ప్రతి చిన్న అంశాన్ని తక్షణమే దేశంలో ప్రతి పౌరుడికి అందాలన్నారు. పర్యావరణ మార్పులను తట్టుకుని అధిక దిగుబడినిచ్చే పంటల వైపు పరిశోధనలు ముమ్మరం చేయాలన్నారు. అనంతరం సదస్సులో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్యదర్శి ఎం.రఘునందన్‌రావు మాట్లాడుతూ వాతావరణంలో మార్పులను ప్రతి వ్యక్తి అర్థం చేసుకోవాలన్నారు. ఇప్పటివరకు ఆహార భద్రత కోసమే పరిశోధనలు జరిగాయని, దేశంలో పోషక భద్రత కోసం తగిన విధివిధానాలు రూపొందించుకొని పనిచేయాలన్నారు. ఈ లక్ష్యానికి పర్యావరణ మార్పులు అడ్డుగా నిలుస్తున్నాయని, వాతావరణ శాఖ, సాంకేతిక నిపుణులు, శాస్త్రవేత్తలు వీటి పరిష్కారానికి సమష్టిగా కృషి చేయాలని తెలిపారు. ఉద్యాన వర్శిటీ వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్. దండా రాజిరెడ్డి మాట్లాడుతూ ఉద్యాన రంగంపై పర్యావరణ మార్పుల ప్రభావం తగ్గించేందుకు, అవకాశమున్న ప్రతి సాంకేతిక, పరిశోధన అంశాన్ని రైతులకు చేరవేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఉద్యాన శాఖ, విశ్వవిద్యాలయం సంయుక్తంగా రైతులకు చేదోడు వాదోడుగా ఉంటూ పర్యావరణ మార్పుల ప్రభావాన్ని అధిగమిస్తామన్నారు. అనంతరం నిపుణులు తీర్చిదిద్దిన ఇంట్రడక్టరీ అగ్రికల్చర్ మెటీరియాలజీ బుక్, బుక్ ఆఫ్ అబ్‌స్ట్రాక్ట్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ్ భాస్కర్, బోర్లాగ్ ఇన్‌స్టిట్యూట్ ప్రోగ్రాం లీడర్ డాక్టర్ ప్రమోద్ కుమార్ అగర్వాల్, వర్సిటీ రిజిస్టర్ భగవాన్, వాతావరణ శాఖ ఉద్యాన నిపుణులు, శాస్త్రవేత్తలు, పరిశోధన విద్యార్థులు పాల్గొన్నారు.