
వసతుల మాట.. ప్రగతి బాట
పల్లెల్లో మౌలిక వసతుల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా గ్రామ పంచాయతీలలో ఏ సౌకర్యాలు ఉన్నాయి? ఇంకా ఏ సౌకర్యాలు కల్పించాలనే దానిపై పంచాయతీ శాఖ సర్వే నిర్వహిస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 1,613 గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శులు వివరాలు సేకరిస్తూ ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఈ రిపోర్ట్ అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులను వినియోగించనున్నారు.
– సాక్షి, సిద్దిపేట
రెండు రోజుల్లో పూర్తి
గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు సర్వే ప్రారంభించారు. సర్వే రెండు రోజుల్లో పూర్తి కానుంది. గ్రామంలో ప్రభుత్వానికి చెందిన కార్యాలయాలు, మౌలిక వసతుల వివరాలన్నీ యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఈ వివరాలను పంచాయతీ రాజ్ కమిషనర్‌కు పంపిస్తాం.
– దేవకీదేవి, డీపీఓ, సిద్దిపేట
పంచాయతీ శాఖ అధికారుల ఆదేశాల మేరకు గురువారం గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు సర్వే ప్రారంభించారు. 21 అంశాలలో పంచాయతీ కార్యదర్శులు సర్వే చేపడుతున్నారు. రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్లు, పంచాయతీ కార్యాలయాలకు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, హెల్త్ సబ్ సెంటర్లకు బిల్డింగ్‌లు ఉన్నాయా? లేవా? అనే వాటిని పరిశీలించి నమోదు చేస్తున్నారు. పాలసేకరణ కేంద్రం, పశు వైద్య ఉపకేంద్రం, లింకు రోడ్లు, ఇంకుడు గుంతలు, ట్రాక్టర్ ట్రాలీల సమాచారాన్ని సైతం నమోదు చేస్తున్నారు.
మూడు భాగాలుగా విభజన
సర్వేలో వచ్చే వివరాల ఆధారంగా ఎంపీడీఓ, డీపీఓల ధ్రువీకరణతో జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీలలో వెనుకబడిన, అత్యంత వెనుకబడిన, అభివృద్ధి చెందిన గ్రామాలుగా ఇలా మూడు భాగాలుగా విభజించనున్నారు. వీటిని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనరేట్‌కు పంపించనున్నారు. అందులో అత్యవసరంగా చేపట్టాల్సిన పనులను ముందుగా గుర్తించి వాటిని ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించనున్నారు. అలాగే ఇంటి, ఆస్తుల బదిలీల వాటా, నల్లా బిల్లు, దుకాణాలకు సంబంధించిన పన్ను రూపంలో వస్తున్న ఆదాయం? అలాగే గ్రామాల్లో ఇతర ఆదాయ వనరులను సృష్టించడం కోసం ప్రణాళికలు తయారుచేయనున్నారు.
జిల్లా పంచాయతీలు
సిద్దిపేట 508
సంగారెడ్డి 613
మెదక్ 492
పల్లెల్లో మౌలిక వసతులపై ఆరా
పంచాయతీ కార్యదర్శుల సర్వే
21 అంశాలలో వివరాలు సేకరణ
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 1,613 గ్రామ పంచాయతీలు

వసతుల మాట.. ప్రగతి బాట