
క్రీడల అభివృద్ధికి ప్రాధాన్యం
● జాతీయస్థాయి క్రీడాకారులతయారీకి సీఎం ప్రత్యేక చొరవ ● జిల్లాస్థాయి కబడ్డీ పోటీల ప్రారంభ సభలో ఎంపీ సురేశ్ షెట్కార్
జహీరాబాద్: రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్రీడల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ స్పష్టం చేశారు. మండలంలోని రంజోల్ గ్రామంలో గురువారం జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను షెట్కార్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గ్రామస్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయస్థాయికి క్రీడాకారులను తయారు చేయాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పనున్నారన్నారు. రాష్ట్రంలోని అన్ని విద్యాలయాలలో పీఈటీలను నియమిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా ప్రభుత్వం తరఫున కానీ, తన తరఫున కానీ అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీనిచ్చారు. తాను కూడా కబడ్డీ ఆడేవాడినని, జహీరాబాద్‌లో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొన్నట్లు గుర్తు చేసుకున్నారు.
కబడ్డీ ఆడిన ఎంపీ
ఈ సందర్భంగా అండర్–14, అండర్–17 విభాగాల్లో 28 మండలాలకు చెందిన 56 జట్లు పోటీల్లో పాల్గొన్నాయి. అంతకుముందు క్రీడాకారులు పరేడ్ నిర్వహించి ఎంపీకి గౌరవ వందనం చేశారు. కొద్దిసేపు క్రీడాకారులతో కలసి ఎంపీ షెట్కార్ కబడ్డీ ఆడారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుభాష్‌రావు, ఆత్మ చైర్మన్ రామలింగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్‌చార్జి జి.శుక్లవర్ధన్‌రెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నరేశ్‌గౌడ్, ఏఐబీఎస్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌నాయక్, కాంగ్రెస్ జిల్లా నాయకులు వైద్యనాథ్ తదితరులు పాల్గొన్నారు.

క్రీడల అభివృద్ధికి ప్రాధాన్యం