
సంజీవనితో పసి హృదయాలు పదిలం
కొండపాక(గజ్వేల్): సత్యసాయి సంజీవని ఆసుపత్రి.. పసి హృదయాలను పదిలం చేస్తున్న దేవాలయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. కొండపాకలోని సత్యసాయి సంజీవని చైల్డ్ హార్ట్ కేర్ ఆస్పత్రిలో వివిధ రాష్ట్రాలకు చెందిన 196 మంది చిన్న పిల్లలకు గుండె సంబంధిత వ్యాధులకు ఆపరేషన్లు విజయవంతమవ్వడంతో బుధవారం గిఫ్టు ఆఫ్ లైఫ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆస్పత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో హరీశ్‌రావు మాట్లాడుతూ సత్యసాయి సంజీవని ఆస్పత్రి సేవలు విశ్వవ్యాప్తం అయ్యేలా ప్రతీ ఒక్కరం బాధ్యతగా కృషి చెద్దామన్నారు. జీవితం శాశ్వతం కాదని చేస్తున్న మంచి పనులు శాశ్వతంగా నిలుస్తాయన్నారు. కొండపాక శివారులో అనాథ వృద్ధాశ్రమం, అష్టాదశ శక్తి పీఠ దేవాలయం, సత్యసాయి బాలికల జూనియర్ కళాశాలతో పాటు సత్యసాయి సంజీవని చైల్డ్ హార్ట్ కేర్ ఆసుపత్రి వెలువడంతో ప్రపంచ దేశాల్లో ఈ గడ్డ సేవా రంగంలో గొప్పగా పేరొందుతోందని అన్నారు. అనంతరం గుండె ఆపరేషన్ చేయించుకున్న పిల్లలకు గిప్టు ప్ లైఫ్ సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో ఆస్పత్రి నిర్వహణ చైర్మన్ శ్రీనివాస్, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, దేశపతి శ్రీనివాస్,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు