
భవనం పైనుంచి దూకి..
వట్‌పల్లి(అందోల్): మతిస్థిమితం సరిగాలేని మహిళ భవనంపై నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ కేసు మండలంలో చర్చనీయాంశమైంది. వివరాలు... మునిపల్లి మండలం పెద్ద చెల్మడ గ్రామానికి చెందిన అంజమ్మ (45) అందోలు మండలంలోని మాసానిపల్లి గ్రామంలో గల తమ బంధువు కుమార్ గౌడ్ ఇంట్లో ఉంచారు. ఆమె కొంత కాలంగా అనారోగ్యంతో ఉండటంతో 15 రోజులుగా మందులు వాడకపోవడం వల్ల మతిస్థిమితం తప్పినట్లు బంధువులు చెప్పారు. 16న రాత్రి 9 గంటల సమయంలో అంజమ్మ భవనంపైకి ఎక్కి దూకింది. గమనించిన కుమార్ గౌడ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెకు సీపీఆర్ చేసి, జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి చనిపోయినట్లు నిర్ధారించారు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు అభ్యంతరం తెలిపారు. 17న 3 గంటల సమయంలో మృతదేహాన్ని పెద్ద చెల్మడ గ్రామానికి తరలించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ పాండు వెళ్లి మృతదేహాన్ని తమకు అప్పగించాలన్నారు. దీంతో మృతురాలి బంధువులు, మృతురాలి భర్త రాజయ్య పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. చివరకు నచ్చజెప్పి సదాశివపేట ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి వారికి అప్పగించారు.
మతిస్థిమితం సరిగా లేని మహిళ మృతి
ఆస్పత్రి నుంచి మృతదేహం తరలింపు
పోలీసులతో బంధువుల వాగ్వాదం