
కుంటలో బాలుడి గల్లంతు
జహీరాబాద్ టౌన్: ఈతకు వెళ్లిన బాలుడు కుంటలో గల్లంతయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం... కోహీర్ మండలం పిచరాగడి గ్రామానికి చెందిన రిజ్వాన్(17) స్నేహితులు సలీం, గుల్లుతో కలిసి సోమవారం హుగ్గెల్లి గ్రామ శివారులో గల కుంటలో ఈత కొట్టేందుకు వచ్చారు. రిజ్వాన్ లోతైన ప్రాంతానికి వెళ్లడంతో ఈత రాకపోవడంతో నీట మునిగాడు. ఈ ఘటనతో భయపడిన స్నేహితులు అక్కడి నుంచి పారిపోయారు. విషయం తెలుసుకున్న జహీరాబాద్ రూరల్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కుంటలో గాలింపు చేపట్టారు. చీకటి పడుతున్నా బాలుడి ఆచూకీ లభించలేదు. మంగళవారం ఉదయం గాలింపు చేపట్టనున్నట్లు అగ్నిమాపక శాఖ అధికారులు పేర్కొన్నారు.