
పెచ్చులూడిన పాఠశాల పైకప్పు
విద్యార్థులకు తప్పిన ప్రమాదం
అల్లాదుర్గం(మెదక్): పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాఠశాల స్లాబు పెచ్చులూడి కింద పడ్డాయి. ఈ ఘటన ఆదివారం రాత్రి గడి పెద్దాపూర్ జెడ్పీ పాఠశాలలో చోటు చేసుకుంది. ఈ భవనాన్ని 60 ఏళ్ల క్రితం నిర్మించారు. కొన్ని గదులు రేకులతో నిర్మించగా వాటికి రంధ్రాలు పడ్డాయి. మరో రెండు గదులు సైతం శిథిలావస్థకు చేరుకొని వర్షం పడితే గదుల్లోకి నీరు చేరుతుందని విద్యార్థులు తల్లిదండ్రులు వాపోతున్నారు. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి తరతిగది పెచ్చులూడి పడ్డాయి. విద్యార్థులు లేకపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికై నా ప్రమాదాలు జరగకముందే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ప్రసవానికి వెళితే
పుస్తె అపహరణ
జోగిపేట ఏరియా ఆస్పత్రిలో ఘటన
జోగిపేట(అందోల్): ఆస్పత్రికి ప్రసవానికి వెళితే పుస్తెను అపహరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. ఈనెల 13న అందోలు మండలం పోసానిపేట గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి ప్రసవం కోసం జోగిపేట ఏరియా ఆస్పత్రిలో చేరింది. సర్జరీ తప్పనిసరి కావడంతో శనివారం ఆ మహిళను ఆపరేషన్ థియేటర్‌కు తీసుకువెళ్లారు. ఆపరేషన్ సమయంలో సిబ్బంది థియేటర్ ప్రక్క గదిలోకి తీసుకువెళ్లి మెడలో పుస్తె, బంగారు ఆభరణాలు(నాలుగు గ్రాములు) తీసేశారు. అదే రోజు సర్జరీ చేశారు. ఆ మహిళ ఆడపిల్లకు జన్మనిచ్చింది. సర్జరీ తర్వాత బయటకు వచ్చాక బంగారు పుస్తెను భర్తను అడుగగా తనకు ఇవ్వలేదని చెప్పాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు సిబ్బందిని అడుగగా తమకు తెలియదని చెప్పారు. ఈ వివాదం ఆస్పత్రి సూపరింటెండెంట్ సౌజన్య వద్దకు వెళ్లడంతో సిబ్బందిని పిలిచి మందలించింది. అయినా ఫలితం లేకపోవడంతో బాధితురాలి భర్త అశోక్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంగారం రూ.40వేల విలువ ఉంటుందని బాధితులు తెలిపారు. అయితే ఆడపిల్ల పుట్టగానే రూ.3వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా, రూ.వెయ్యి ఇచ్చినట్లు బాధిత మహిళ చెప్పారు.