
ఇందిరమ్మ.. మరింత వేగవంతం
లబ్ధిదారులే నేరుగా..
మెదక్ కలెక్టరేట్: నిరుపేద ప్రజలకు సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని చేపట్టింది. ఎంపిక చేసిన లబ్ధిదారుల్లో 90 శాతం నిరుపేదలే కావడంతో డబ్బులు లేక పనులు ప్రారంభించలేదు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం ఇప్పటికే ఉచితంగా ఇసుక తెచ్చుకునేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కొన్ని నిర్మాణాలు చేపట్టగా ఇంకా చాలా మంది నిర్మాణాలు మొదలు పెట్టలేదు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పారదర్శకత ఉండాలని, లబ్ధిదారులకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసింది. ఇటీవల జిల్లా హౌసింగ్ పీడీ మాణిక్యం ఏఈలతో సమావేశం నిర్వహించి టోల్ ఫ్రీ నంబర్ లబ్ధిదారులకు అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఆరు నియోజకవర్గాలకు..
మెదక్, నర్సాపూర్, గజ్వేల్, దుబ్బాక, ఆందోల్, నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గాలకు చెందిన 21 మండలాలు ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో ఉంటాయి. అన్ని మండలాలకు కలిపి మొత్తం 9600 ఇండ్లు మంజూరయ్యాయి. ఇందులో ఇప్పటి వరకు 5వేల ఇళ్లు ప్రారంభం కాగా 360 ఇళ్లు బేస్మెంట్‌స్థాయిలో ఉన్నాయి. ఇంకా ప్రారంభానికి నోచుకోనివి 4వేలకు పైచిలుకు ఉన్నాయి. కాగా లబ్ధిదారులు తహసీల్దార్ ద్వారా ఆమోదం పొంది ప్రభుత్వం ఇసుక తెచ్చుకునే వీలు కల్పించింది. ఇంటి నిర్మాణం ప్రారంభించలేని నిరుపేదలకు స్వయం సంఘాల నుంచి రూ.లక్ష వరకు రుణాలు ఇప్పించేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు గ్రామాల్లో లబ్ధిదారుల గుర్తింపు కార్యక్రమం కొనసాగుతుంది.
టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో మరింత పారదర్శకత, బిల్లుల సమస్యలు ఉత్పన్నం కాకుండా ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబర్ 1800 5995991 ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూం హైదరాబాద్‌లో ఉంటుంది. బిల్లులు, నిర్మాణం తదితర సమస్యలపై లబ్ధిదారులు నేరుగా ఫోన్‌చేసి మాట్లాడవచ్చు. ఇటీవల హౌసింగ్ పీడీ జిల్లాలోని ఏఈలతో సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు. లబ్ధిదారులు ఇళ్లు కట్టుకునేటప్పడు ఏర్పడిన సమస్యలను ఈ నంబర్‌కు కాల్‌చేసి చెబితే అధికారులు కావాల్సిన సహాయం అందిస్తారు.
పంచాయతీ కార్యదర్శి అందుబాటులో లేకుంటే లబ్ధిదారులే నేరుగా ఫొటోతోపాటు తమ వివరాలు యాప్‌లో అప్‌లోడ్ చేయొచ్చు. ఈ విధానంపై అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్
లబ్ధిదారులే ఫొటో అప్‌లోడ్ చేసే అవకాశం
ఇల్లు ప్రారంభించని వారికి రుణ సౌకర్యం