
పేకాటరాయుళ్ల అరెస్ట్
కంగ్టి(నారాయణఖేడ్): పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వెంకట్‌రెడ్డి, ఎస్‌ఐ దుర్గారెడ్డి వివరాల ప్రకారం... మండల కేంద్రంలోని శివారులో ఆదివారం పంట చేన్లలో పేకాట ఆడుతున్న ఏడుగురు జూదరులను పట్టుకొని వారి వద్ద నుంచి రూ. 47,820 స్వాధీనం చేసుకున్నారు. వారితో పాటు చేను యజమానిపై సైతం కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించనున్నట్లు పేర్కొన్నారు. దాడిలో పోలీసు సిబ్బంది రాజ్‌కుమార్, సాయికిరణ్, సతీశ్ పాల్గొన్నారు.
పలువురికి గాయాలు
చేగుంట(తూప్రాన్): రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... మెదక్ నుంచి వస్తున్న టాటా ట్రాలీ వాహనం మూల మలుపు వద్ద అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరు మందికి గాయాలు కాగా తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా లచ్చవ్వ అనే మహిళ పరిస్థితి విషమంగా ఉంది. సికింద్రాబాద్ బేగంపేట నుంచి మెదక్ చర్చికి వచ్చి తిరిగి వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.
సంగారెడ్డి క్రైమ్: బంధువుల ఇంటికి వచ్చిన వృద్ధుడు అదృశ్యమయ్యాడు. ఈ ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రమేశ్ వివరాల ప్రకారం... మానురు మండలం డోవురు గ్రామానికి చెందిన కుర్నం నర్సింలు(53) పట్టణంలోని బంధువుల ఇంటికి వచ్చాడు. శనివారం మధ్యాహ్నం 12గంటల సమయంలో కొత్త బస్టాండ్‌లో బస్సు దిగిన వెంటనే తన అల్లుడికి ఫోన్‌లో సమాచారం అందించాడు. అనంతరం బంధువులు కొత్త బస్టాండ్‌కు రాగా కనిపించలేదు. చుట్టుప్రక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు
సిద్దిపేటజోన్: ప్రైవేటు ఆస్పత్రుల్లో పని చేసే వర్కర్లకు శ్రమకు తగిన వేతనం ఇవ్వాలని బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కలాల్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి తూర్పు రాంరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని ఓ గార్డెన్‌లో ప్రైవేట్ హాస్పిటల్స్ మజ్దూర్ మహాసంఘ్ జిల్లా మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. వర్కర్లకు సంవత్సరానికి ఒకసారి డీఏను కలుపుకొని జీతాలు ఇవ్వాలన్నారు. కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్ వర్తింపజేయాలని, గ్రాట్యూటీతో కూడిన కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దసరా, దీపావళికి ఒక నెల బోనస్ ఇవ్వాలని, వారానికి ఒక రోజు సెలవు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో బీఎంఎస్ జిల్లా అధ్యక్షుడు చామకూర రాజయ్య, ప్రైవేటు హాస్పిటల్స్ ఇన్‌చార్జి ఉమేశ్ తదితరులు పాల్గొన్నారు.

పేకాటరాయుళ్ల అరెస్ట్