
జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు మేలు
మెదక్ ఎంపీ రఘునందన్‌రావు
సదాశివపేట(సంగారెడ్డి): కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ రెండు స్లాబుల విధానంలో 85 రకాల వస్తువులపై జీఎస్టీ తగ్గించడం వల్ల మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ ధరలపై ఆదివారం పట్టణంలోని బసవ సేవాసదన్ ఫంక్షన్ హాలులో వర్తక, వాణిజ్య వ్యాపారస్తులతో జీఎస్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ మాట్లాడుతూ... ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇన్‌కమ్ టాక్స్ 12 లక్షల వరకు మినహాయింపు ఇవ్వడంతో మధ్యతరగతి ఉద్యోగులకు లాభం చేకూరుతుందన్నారు. మోదీ ప్రధాని పదవి చేపట్టిన రెండున్నరేళ్లలోనే రాజకీయ పార్టీలను ఒప్పించి 2017లో జీఎస్టీ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి చట్టం చేశారన్నారు. వస్తువులపై జీఎస్టీ తగ్గించడం వల్ల మార్కెట్లో వస్తువుల కొనుగోళ్లకు చాలా డిమాండ్ పెరుగుతుందని వ్యాపారులకు కూడా మంచి లాభాలు వస్తాయన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎంత మొరిగినా మోదీ భయపడలేదని, దేశాన్ని కాపాడుకుంటానని వేసిన అడుగులే స్వదేశీ వైపు వేసే అడుగులని ప్రతి ఒక్క భారతీయుడు గర్వించతగ్గ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఆస్తి పంపకాలు, పదవుల కూర్చీల పంచాయితీ నడుస్తుందన్నారు. కార్యక్రమంలో మెదక్ బీజేపీ పార్టీ కోకన్వీనర్ సంగమేశ్వర్, బీజేపీ నాయకులు చంద్రశేఖర్, జగన్, వేణుమాధవ్, వ్యాపారస్తులు, ప్రజలు పాల్గొన్నారు.