
పోరాటాలకు సిద్ధంకండి
నారాయణఖేడ్: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాల స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం.నర్సింహులు పిలుపునిచ్చారు. ఖేడ్ సీపీఎం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవ సభను శ్రీనివాస కళాశాలలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింహులు మాట్లాడుతూ...1946 నుంచి 1951వరకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగిందన్నారు. నైజాం, రజాకార్లు, జాగిర్దార్ల, జమిందార్లకు వ్యతిరేకంగా నాడు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం భూమికోసం, భుక్తికోసం, వెట్టి చాకిరీ నుంచి విముక్తి కోసం మహత్తరమైన పోరాటం చేసిందని గుర్తు చేశారు. ఈ పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకం అని అన్నారు. కార్యక్రమంలో నారాయణఖేడ్ ఏరి యా కార్యదర్శి రమేశ్, నాయకులు సతీశ్, అరు ణ్, రఘు, కాన్షీరాం తదితరులు పాల్గొన్నారు.
బకాయిలు విడుదల చేయండి
నారాయణఖేడ్: స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి సీహెచ్ ఆనంద్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
చింపితే చరిత్ర చెరిగిపోదు
సాయుధ పోరాట వారోత్సవాల్లో
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ప్రకాశ్‌రావు
సదాశివపేట(సంగారెడ్డి): చరిత్రను బీజేపీ నేతలు చెరిపినంత మాత్రాన చెరిగిపోదని తెలంగాణ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ప్రకాశ్‌రావు పేర్కొన్నారు. సదాశివపేటలో సీపీఐ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలకు ముఖ్య అతిథిగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ప్రకాశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్య్రం వచ్చినా హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం పరిపాలనలో ఉందన్నారు. నిజాం సంస్థానం దేశంలో విలీనం కావాలని 1947 సెప్టెంబర్ 11న తెలంగాణ సాయుధ పోరాటానికి సీపీఐ నేతలు రావి నారాయణ రెడ్డి, మఖ్దూం మొయీనుద్దీన్, బద్దం ఎల్లారెడ్డి, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, షాయిబుల్లాఖాన్, రాజాబ్ అలీలు పిలుపునిచ్చారని గుర్తు చేశారు. కమ్యూనిస్టులో పోరాటంతోనే 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానా న్ని దేశంలో విలీనం చేశారన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రెహమాన్,కార్యదర్శి వర్గ సభ్యుడు షఫీ, పట్టణ మండల కార్యదర్శులు అనసూయ, పాండు, మునిపల్లి మండల కార్యదర్శి గంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
శిథిలాల తొలగింపు
పనుల పరిశీలన
మునిపల్లి(అందోల్): లింగంపల్లి గురుకుల పాఠశాల విద్యార్థులు ఉండేందుకు చేపట్టిన తాత్కాలిక పనులను మాజీ జెడ్పీటీసీ అసత్ పటేల్ ఆదివారం పరిశీలించారు. గురుకుల పాఠశాల హాస్టల్ శిథిలాలను జేసీబీతో తొలగించే పనులను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...విద్యార్థులు తాత్కాలికంగా ఉండేందుకు రేకులషెడ్ పనులు పూర్తి కావచ్చాయన్నారు. మైనర్ పనులు పూర్తి కాగానే విద్యార్థులను పంపిస్తారని తెలిపారు. కార్యక్రమంలో తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, మక్సూద్ పటేల్‌తోపాటు తదితరులు పాల్గొన్నారు.

పోరాటాలకు సిద్ధంకండి

పోరాటాలకు సిద్ధంకండి