
నేటి నుంచి ఎస్‌జీఎఫ్ క్రీడలు
● ఏర్పాట్లు చేసిన అధికారులు ● అక్టోబర్‌లో రాష్ట్రస్థాయి పోటీలు
న్యాల్‌కల్(జహీరాబాద్): జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్(స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) క్రీడా పోటీలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. అన్ని క్రీడలు ఒకే చోట కాకుండా వివిధ ప్రాంతాల్లో నిర్వహించనున్నారు. సంగారెడ్డి జిల్లాతోపాటు ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి పోటీలు కూడా జరగనున్నాయి. ఈ పోటీలు ఈ నెలాఖరు వరకు జరగనున్నాయి. వచ్చే అక్టోబర్‌లో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించనున్నారు.
క్రీడలివే....
ఎస్‌జీఎఫ్‌లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్‌బాల్, కరాటే, బ్యాడ్మింటన్, తైక్వాండో, సాఫ్ట్‌బాల్, బేస్‌బాల్, టేబుల్ టెన్నిస్, అథ్లెటిక్స్, షటిల్, చందరంగం, బాస్కెట్ బాల్, హ్యాండ్ బాల్, ఫెన్సింగ్, క్రికెట్, రెజ్లింగ్ తదితరల క్రీడలు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో బాలిబాలికలు పాల్గొననున్నారు.
ముందు బ్యాడ్మింటన్.. కబడ్డీ పోటీలు
పటాన్‌చెరువు మండల పరిధిలోని బీరంగూడ లో (ఉమ్మడి మెదక్) జిల్లా బ్యాడ్మింటన్ పోటీ లు సోమవారం ప్రారంభం కానున్నాయి. అండర్ 14, 17 బాల బాలికలు పాల్గొననున్నారు. వయస్సుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రా లతో పోటీలకు హాజరు కావాలని అధికారులు చెబుతున్నారు. కబడ్డీ పోటీలను ఈ నెల 16, 17న జహీరాబాద్ మండల పరిధిలోని రంజోల్ సంగమేశ్వర పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో నిర్వహించ వలసి ఉండగా ఆ పోటీలను వాయిదా వేసినట్లు తెలిసింది. వాటిని ఈనెల 18న నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ పోటీలు పూర్తయిన తర్వాత మిగిలిన వాటిని నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు.