
పారదర్శకంగా విద్యావలంటీర్ల ఎంపిక
● ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ● త్వరలో ఎంపికై న అభ్యర్థుల వివరాల ప్రకటన
పటాన్‌చెరు/రామచంద్రాపురం (పటాన్‌చెరు): పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాథమిక పాఠశాలల్లో విద్య వలంటీర్ల ఎంపిక ప్రక్రియను పూర్తి పారదర్శకతతో నిర్వహించినట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్‌చెరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆది వారం విద్యా వలంటీర్ల పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎంపిక కమిటీ సమక్షంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. అంతకుముందు రామచంద్రాపురం పట్టణంలోని ప్రభుత్వ పెన్షనర్ల సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...ఎటువంటి సిఫార్సులను అనుమతించకుండా కేవలం మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. కమిటీ ఆధ్వర్యంలో తయారు చేసిన తుది జాబితాను జిల్లా కలెక్టర్ కు పంపిస్తామని ఆ తర్వాత అభ్యర్థుల వివరాలను ఆయా మండల విద్యాశాఖ అధికారుల కార్యాలయంలో ప్రచురిస్తామని తెలిపారు. ప్రభుత్వ పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. గతంలో నిర్మించిన పెన్షనర్ల సంక్షేమ సంఘం భవనం ప్రస్తుత అవసరాలకు సరిపోవడం లేదని సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకునిరాగా రామచంద్రాపురం ప్రెస్‌క్లబ్ సభ్యులతో చర్చించి మరో అంతస్తు నిర్మించేందుకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. నూతనంగా రూ.30 లక్షల నిధులతో ప్రస్తుత భవనంపై అన్ని సౌకర్యాలతో ప్రెస్ క్లబ్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.సమావేశంలో అన్ని మండలాల తహసీల్దార్‌లు, విద్యాశాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.