
కొలువుదీరిన జీపీఓలు
● జిల్లాకు 238 మంది నియామకం ● అదనపు కలెక్టర్‌ను కలిసిన అధికారులు
సంగారెడ్డి జోన్: రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ చర్యలలో భాగంగా క్లస్టర్లవారీగా జీపీఓల నియామకం చేపట్టింది. గత ప్రభుత్వంలో రద్దు చేసిన పాత అధికారుల నుంచి వారి ఆసక్తి మేరకు దరఖాస్తులు స్వీకరించి, అర్హత పరీక్షలు నిర్వహించారు. ఉత్తీర్ణత సాధించిన వారికి ఇటీవల కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగులు ఇచ్చారు. ఈ మేరకు జిల్లాలో 238 మంది జీపీఓలను నియమించారు.
జిల్లాలో 325 క్లస్టర్లు
జిల్లావ్యాప్తంగా నాలుగు డివిజన్ల పరిధిలో 325 క్లస్టర్లుగా విభజించారు. పాత ఉద్యోగులను 238 మందిని ఎంపిక చేసి నియమించారు. మిగతా క్లస్టర్లలో ఆయా మండలాల్లోని జూనియర్ అసిస్టెంట్లకు ఇన్‌చార్జిలుగా నియమించనున్నారు. పోస్టింగ్‌లు వచ్చిన జీపీఓలు సంబంధిత తహసీల్ కార్యాలయ పర్యవేక్షణలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
అదనపు కలెక్టర్‌ను కలిసిన జీపీఓలు
నూతనంగా నియమితులైన జీపీఓలు అదనపు కలెక్టర్ మాధురిని మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్ లో పూల మొక్కను అందించి కృతజ్ఞతలు తెలిపారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ..విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా నిర్వర్తించాలని సూచించారు.

కొలువుదీరిన జీపీఓలు