
బాలికలకు చదువే భరోసా
● మంత్రి దామోదర రాజనర్సింహ ● ఆస్పత్రులకు వెళితే ఆర్థిక భారంపడకూడదన్నదే లక్ష్యం ● 126 మంది ఉపాధ్యాయులకు సన్మానం
వట్‌పల్లి (అందోల్): తాను గతంలో విద్యాశాఖ మంత్రిగా ఎనిమిదేళ్లు పనిచేశానని, ఇప్పటికీ ఆ శాఖ అంటే చాలా ఇష్టమని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. అందోలు మండలం అల్మాయిపేట లక్ష్మిదేవి గార్డెన్‌లో శుక్రవారం జరిగిన నియోజకవర్గస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కార కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గురువు ఉన్న ప్రదేశంలో అక్కడి సమాజ ప్రవర్తన తెలుస్తుందని చెప్పారు. ఆస్పత్రికి వెళితే ప్రజలకు ఆర్థికభారం కలగకూడదన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్య, వైద్యం రెండు శాఖలు ముఖ్యమైనవేనని అందోల్ నియోజకవర్గంలో ఫార్మసీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలు, మండలానికొక మోడల్ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ విద్యాలయాలు ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. సమాజానికి బాలికల చదువు చాలా ముఖ్యమని, అమ్మాయిలు చదివితేనే కుటుంబానికి సంపూర్ణ భరోసా ఉంటుందని అభిప్రాయపడ్డారు. నియోజకవర్గంలో రూ.15 కోట్లతో బాలికల విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో రాజనర్సింహ అంటే గుర్తింపు రావడం అందోల్ నుంచే లభించిందన్నారు. అందుకే ఈ ప్రాంతానికి ఎప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. పీఆర్‌టీయు అధ్యక్షుడు ఎ. మాణయ్య అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, మార్క్‌ఫెడ్ డైరెక్టర్ ఎస్.జగన్మోహన్‌రెడ్డి, ఆర్డీఓ పాండు తదితరులు పాల్గొన్నారు.