
బైక్ చోరీ
నిజాంపేట(మెదక్): పొలం వద్ద ఉంచిన బైక్ చోరీకి గురైంది. ఈ ఘటన మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాజేశ్ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కంపె నాగరాజు తన వ్యవసాయ పొలంలోని గుడిసె వద్ద బైక్‌ను ఉంచి పని చేసుకుంటున్నాడు. పనులు ముగించుకుని వచ్చే సరికి అక్కడ బైక్ కనిపించలేదు. దీంతో చుట్టు ప్రక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గ్రామంలో సీసీ కెమెరాల ఆధారంగా వ్యక్తిని గుర్తు పడితే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
మాసాయిపేటలో...
వెల్దుర్తి(తూప్రాన్): మండల కేంద్రమైన మాసాయిపేటలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగుడు కిరాణం షాపు, లాండ్రీ షాపు తాళాలు పగులగొట్టి చోరీ చేశాడు. నగదుతోపాటు వస్తువులు చోరీకి గురైనట్లు షాపు యజమానులు తెలిపారు. ఇదిలా ఉండగా దగ్గరలోనే ఉన్న సాయిబాబ దేవాలయం వద్ద గల తాళాలు సైతం ధ్వంసమయ్యాయని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదవశాత్తు
చెరువులో పడి వ్యక్తి..
నిజాంపేట(మెదక్): ప్రమాదవశాత్తు చెరువులో పడిన వ్యక్తి నీట మునిగి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని నార్లాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బదనకంటి (గొల్ల) లక్ష్మి , పర్శరాములు దంపతుల కుమారుడు మహేశ్(24) శుక్రవారం ఉదయం గేదెలను మేపడానికి వెళ్లి సాయంత్రమైనా ఇంటికి రాలేదు. దీంతో చుట్టు ప్రక్కల వెతుకుతుండగా గ్రామంలో ఉన్న హైదర్ చెరువు వద్ద మృతుని చెప్పులు కనబడటంతో పోలీసులకు సమాచారం అందించారు. రెస్క్యూ టీమ్ సహాయంతో వెతకగా శనివారం ఉదయం మృతదేహం లభ్యమైంది. చెరువులోకి దిగిన గేదెలను బయటకు తోలుకురావడానికి మహేశ్ నీటిలోకి దిగాడు. ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మరణించాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

బైక్ చోరీ