
కేంద్రం వల్లే యూరియా కొరత
రైతు సంఘం రాష్ట్ర నాయకులు గొల్లపల్లి జయరాజు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: కేంద్ర ప్రభుత్వ విధానాలే యూరియా కొరతకు కారణమని, రైతులకు కావలసిన యూరియాను వెంటనే అందించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకుడు గొల్లపల్లి జయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టరేట్ ఏఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జయరాజు మాట్లాడుతూ...కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన కోటా ప్రకారం యూరియా, ఎరువులను సరఫరా చేయలేదని విమర్శించారు. రసాయన ఎరువులపై సబ్సిడీని కేంద్రం క్రమంగా కోత పెడుతూ నానో యూరియాను బలవంతంగా మోపే ప్రయత్నం చేస్తోందన్నారు. రాష్ట్రానికి 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటివరకు 7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందన్నారు. రాష్ట్రానికి వచ్చిన యూరియాను ప్రణాళికాబద్ధంగా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. గత నెల రోజులుగా రైతులు యూరియా సరఫరా కేంద్రాల వద్ద బారులు తీరి గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సకాలంలో ఎరువులు అందుబాటులో లేకపోతే పంటలు దిగుబడి తగ్గే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే యూరియా కొరతను తీర్చాలని కోరారు.