
నిమ్జ్ భూబాధితులకు బాసట
జహీరాబాద్ టౌన్: ఎన్నో ఉద్యమాలు, పోరాటాల తర్వాత రైతులకు మేలు చేసే 2013 భూసేకరణ చట్టాన్ని ప్రఽభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయని వ్యవసాయ కార్మిక సంఘం అఖిలభారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ ఆరోపించారు. నిమ్జ్ ప్రాజెక్టు కోసం చట్టానికి వ్యతిరేకంగా బలవంతంగా భూములను తీసుకోవడానికి నిరసిస్తూ శుక్రవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జహీరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రామిక్ భవనం నుంచి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు కొనసాగింది. అనంతరం నిమ్జ్ కార్యాలయం వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ సమగ్ర భూచట్టాలను అమలు చేస్‌తేౖ రైతులకు పరిహారం ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వాలు స్వార్థప్రయోజనాల కోసం భూసేకరణ చట్టానిక తూట్లు పొడుస్తున్నాయని మండిపడ్డారు. భూముల ధరలను సవరించకుండా ఏకపక్షంగా నిమ్జ్ భూసేకరణకు ఎందుకు నోటిఫికేషన్లు వేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఽరెండు పంటలు పండే సారవంతమైన భూములకు 15 లక్షల పరిహారం ఇవ్వడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. బహిరంగ మార్కెట్‌లో ఎకరం రూ.50 లక్షలు పలుకుతుంటే రూ.15 లక్షలు ఎలా ఇస్తారన్నారు. చట్ట ప్రకారం భూమిలేని కూలీలకు పునరావాసం కూడా ఇవ్వడంలేదన్నారు. రైతుల భూముల్లో పనులు చేపడుతూ చట్టాన్ని ఉల్లఘిస్తున్నారని ఆరోపించారు. పరహారం పెంచాలని, ఎకరానికి 120 గజాల ప్లాటు, వ్యవసాయ కూలీలకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో జిల్లా అధ్యక్షులు బి.రాంచందర్, నాయకులు సుకుమార్, నర్సింలు, శంకర్, సీఐటీయూ నాయకులు మహిపాల్, నిమ్జ్ భూబాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వారి పక్షాన రాజీలేని పోరాటం చేస్తాం
భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న ప్రభుత్వాలు
వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకట్