
నా భర్త ఆచూకీ కనిపెట్టండి
మంత్రి పొన్నంకు జవాన్ భార్య విన్నపం
అక్కన్నపేట(హుస్నాబాద్): మండలంలోని ఐనపూర్ గ్రామానికి చెందిన తోట అనీల్ (ఆర్మీ జవాన్) ఆచూకీని కనిపెట్టాలని భార్య అనూష మంత్రి పొన్నం ప్రభాకర్‌ను శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆగస్టు 6వ తేదీన ఇంటి నుంచి పంజాబ్‌లో విధి నిర్వహణకు వెళ్లాడని, మరుసటి రోజునుంచి సెల్‌ఫోన్ స్విచ్‌ఆఫ్ వస్తుందన్నారు. నెలరోజులుగా భర్త ఆచూకీ కోసం వెతికినా సరైన సమాధానం రాలేదని అనూష కన్నీరుమున్నీరయ్యారు. అక్కడి కమాండర్‌ను సంప్రదించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఆమె అమ్మగారి ఇల్లు చౌటపల్లి గ్రామం కావడంతో మంత్రి మల్లంపల్లి–చౌటపల్లి గ్రామాల బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వస్తున్నారని తెలుసుకుని వచ్చారు. పూర్తి వివరాలతో కూడిన ఒక లెటర్‌ను మంత్రి క్యాంపు కార్యాలయంలో అందజేస్తే పంజాబ్‌లోని ఆర్మీ కమాండర్‌తో మాట్లాడి వివరాలను తెలియజేస్తామని మంత్రి భరోసా కల్పించారు.